మన ఐటీ కంపెనీలు అదర గొట్టాయి. మూడు పెద్ద కంపె నీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లు ఒకే రోజు అద్భుతమైన రిజల్ట్స్ ప్రకటించాయి. ఎనలిస్టుల అంచనాలకు మించిన పనితీరు ప్రదర్శించాయి. రాబోయే క్వార్టర్లో ఫలితాలు మరింత మెరుగ్గా ఉండొచ్చనే సంకేతాలూ ఇచ్చాయి.
న్యూఢిల్లీ: 25 బిలియన్ డాలర్ల మార్కు అందుకున్న టీసీఎస్. టీసీఎస్లాభం డిసెంబర్క్వార్టర్లో 16 శాతం పెరిగి రూ. 9,769 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాదిలోని క్యూ3 లాభం రూ. 8,701 కోట్లతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. ఇదే టైములో కంపెనీ రెవెన్యూ కూడా 16 శాతం పెరిగింది. అంతకు ముందు ఏడాది క్యూ3లో టీసీఎస్ రెవెన్యూ రూ. 42,015 కోట్లు. ఈ ఏడాది క్యూ3లో ఈ రెవెన్యూ రూ. 48,885 కోట్లయింది. క్యూ3 పెర్ఫార్మెన్స్తో 2021 కేలండర్ ఇయర్లో కంపెనీ 25 బిలియన్ డాలర్ల (రూ. 1.8 లక్షల కోట్లు) ఆదాయాన్ని అందుకుంది. రూ. 18 వేల కోట్లతో మరోసారి షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. 4 కోట్ల దాకా షేర్లను రూ. 4,500 చొప్పున కొనడానికి ఓకే చెప్పింది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే రూ. 643 ప్రీమియం చెల్లించి బైబ్యాక్ చేయడానికి టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. షేర్‌కు రూ. 7 చొప్పున ఇంటరిమ్ డివిడెండ్‌ను కూడా బుధవారం కంపెనీ ప్రకటించింది. రిజల్ట్స్ ప్రకటన నేపథ్యంలో టీసీఎస్ షేరు 1.5 శాతం తగ్గి రూ. 3,857 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో టీసీఎస్ షేర్లు 21.37 శాతం పెరిగాయి.
ఇన్ఫోసిస్ లాభం రూ. 5,809 కోట్లు
డిసెంబర్2021తో ముగిసిన మూడో క్వార్టర్‌కు ఇన్ఫోసిస్ లాభం 12 శాతం పెరిగి రూ. 5,809 కోట్లకు చేరింది. ఇదే క్వార్టర్లో కంపెనీ ఆదాయం కూడా 23 శాతం ఎక్కువై రూ. 31,867 కోట్లయింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్లో ఇన్ఫోసిస్ ఆదాయం రూ. 25,927 కోట్లు మాత్రమే. పనితీరు మెరుగ్గా ఉండటంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్‌కు ఇంతకు ముందు ఇచ్చిన గైడెన్స్‌ను కంపెనీ సవరించింది. క్యూ3లో 7 శాతం సీక్వెన్షియల్ గ్రోత్ రావడంతో పూర్తి ఏడాదికి గ్రోత్ 19.5–20 శాతం దాకా ఉంటుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. రిజల్ట్స్ బాగుంటాయనే అంచనాలతో ప్రకటనకు ముందే ఇన్ఫోసిస్ షేర్లు బుధవారం సెషన్లో 1.09 శాతం పెరిగి రూ. 1,875 వద్ద ముగిశాయి. గత ఏడాది కాలంగా చూస్తే ఇన్ఫోసిస్ షేరు 36.65 శాతం పెరిగింది. అన్ని వెర్టికల్స్, రీజియన్లలోనూ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఊపందుకోవడంతో ఆర్డర్లు బాగా వస్తున్నాయని ఇన్ఫోసిస్ తెలిపింది. క్యూ3లో టీసీవీతో 2.53 బిలియన్ డాలర్ల డీల్ కుదిరినట్లు పేర్కొంది. తాజా క్వార్టర్లో ఆపరేటింగ్ మార్జిన్స్ మాత్రం 2 శాతం తగ్గి 23.5 శాతానికి చేరినట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం రెవెన్యూలో డిజిటల్ రెవెన్యూ 58.5 శాతమని పేర్కొంది. ఉద్యోగుల వలసను తట్టుకునేందుకు ఈ ఏడాది కొత్తగా 55 వేల మందిని నియమించుకుంటున్నట్లు వివరించింది.
విప్రో రెవెన్యూ 30 శాతం జూమ్...
మరో ఐటీ కంపెనీ విప్రో లిమిటెడ్ డిసెంబర్2021 క్వార్టర్లో అంతకు ముందు ఏడాది క్యూ3లో లాగే రూ. 2,969 కోట్ల లాభం సంపాదించింది. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో విప్రో లాభం రూ. 2,930 కోట్లు. షేర్‌కు రూ. 1 చొప్పున ఇంటరిమ్ డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. డిసెంబర్2021 క్వార్టర్లో కంపెనీ ఆదాయం మాత్రం ఏకంగా 29.6 శాతం పెరిగింది. విప్రో రెవెన్యూ తాజా డిసెంబర్ క్వార్టర్లో రూ. 20,313 కోట్లు. డిసెంబర్2020 క్వార్టర్లో ఈ రెవెన్యూ రూ. 15,670 కోట్లే. వరసగా అయిదు క్వార్టర్లలో స్థిరమైన పెర్ఫార్మెన్స్ సాధించగలిగినట్లు కంపెనీ ఈ సందర్భంగా తెలిపింది. ఆర్డర్లు కూడా బాగున్నాయని, 100 మిలియన్ డాలర్ల రెవెన్యూ వచ్చే ఏడుగురు కొత్త కస్టమర్లను సంపాదించామని పేర్కొంది. బుధవారం సెషన్లో విప్రో షేర్లు 0.45 శాతం తగ్గి రూ. 691 వద్ద ముగిశాయి. ఏడాది కాలంలో చూస్తే విప్రో షేరు 49.62 శాతం పెరిగింది. క్యూ3లో 10,306 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,31,671 కి చేరినట్లు పేర్కొంది.
