తెలంగాణలో బ్లాక్​చెయిన్​ సిటీ త్వరలోనే ఏర్పాటు చేస్తం: మంత్రి శ్రీధర్​బాబు

  • క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్​ఎక్సలెన్స్ కూడా ఏర్పాటు  
  • ఫ్రాంటియర్​ టెక్నాలజీ హబ్​ను హైదరాబాద్ లో పెట్టాలని కేంద్రాన్ని కోరామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బ్లాక్​చెయిన్​ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమల ప్రతినిధులు, నిపుణులతో చర్చలు చేపట్టామన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని మాదాపూర్​లో డ్రోన్​ టెక్నాలజీ, రోబోటిక్స్​కు సంబంధించిన సెంటెలియన్​ నెట్​వర్క్స్​ అండ్​ హెచ్​సీ రోబోటిక్స్​ సంస్థ కొత్త క్యాంపస్​ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. 

ఈ సంస్థ 1,800 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘‘కొత్త సాంకేతికల ఆవిష్కరణలో రాష్ట్రాన్ని నెంబర్​వన్​గా నిలిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మించనున్న ఏఐ యూనివర్సిటీకి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాం. క్వాంటం కంప్యూటింగ్​లోనూ సెంటర్ ఆఫ్​ఎక్సలెన్స్​ను ప్రారంభించనున్నాం. దేశంలో ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్​ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఆ హబ్​ను హైదరాబాద్​లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. కేంద్రం కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం” అని చెప్పారు. 

మోడర్న్ టెక్నాలజీని స్టూడెంట్లకు చేరువ చేసే ఫ్లో

స్కూల్ స్టూడెంట్లకు ఆధునిక టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకుగానూ రూపొందించిన ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ (ఫ్లో/FLOW) వాహనాన్ని శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, మెషీన్ లెర్నింగ్ పరికరాలు, నిపుణులతో కూడిన ఫ్లో వాహనాన్ని.. 33 జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్స్​కు తీసుకెళ్లి విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించనున్నారు. ‘కలామ్ స్ఫూర్తి యాత్ర- 33’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. ఈ వాహనానికి అయిన ఖర్చు దాదాపు రూ.80 లక్షలను ‘సేల్స్ ఫోర్స్ ఇండియా’ అనే సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందించింది. ఈ ఫ్లో వెహికల్​45 రోజుల పాటు 33 జిల్లాల్లోని స్కూళ్లకు వెళ్తుందని చెప్పారు. 

గ్రామీణ యువత ప్రతిభను వెలికితీస్తం

తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో క్రీడలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌గా మంత్రి శ్రీధర్ బాబును ఎన్నికైన సందర్భంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులంతా  మంత్రిని సెక్రటేరియెట్​లో  సన్మానించారు. అనంతరం హైదరాబాద్​లో నిర్వహించనున్న అండర్ 19 ఆల్ ఇండియా జూనియర్  ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బ్రోచర్‌‌ను శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.