మాది చేతల ప్రభుత్వం...గ్యారంటీలను అమలు చేస్తున్నం: మంత్రి శ్రీధర్ బాబు

మేడిపల్లి, వెలుగు : తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన ఎంపీ, ఈటల రాజేందర్, విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ అజయ్ యాదవ్ తో కలిసి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు డివిజన్లలో సుమారు రూ.7 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బడ్జెట్లో  రూ.10వేల కోట్లు కేటాయించి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.

బోడుప్పల్ లోని వర్క్ బోర్డు సమస్య, ఎస్సీ భూముల సమస్యలను ప్రభుత్వం దృష్టికితీసుకువెళ్తామన్నారు. ఈ విషయాల పై న్యాయనిపుణుల సలహాలు తీసుకొని పరిష్కరిస్తామని వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం, కాంగ్రెస్ నేతలు తోటకూర అజయ్ యాదవ్, తోటకూర వజ్రేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజలింగం, మేడిపల్లి ఎమ్మార్వో హసీనా తదితరులు పాల్గొన్నారు.