అది కోర్టులకే పరిమితం కాదు

అది కోర్టులకే పరిమితం కాదు

న్యూఢిల్లీ: న్యాయాన్ని అందించాల్సిన పూర్తి బాధ్యతను రాజ్యాంగం కోర్టులకే అప్పగించిందని అందరూ భావిస్తుంటారని, కానీ అది నిజం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రతి విభాగానికి ప్రత్యేక బాధ్యతను అప్పగించిందని, న్యాయం అనేది కోర్టుల బాధ్యత మాత్రమే అనే భావన రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 తొలగిస్తుందని, ఇది న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుందని చెప్పారు.

దేశంలోని ప్రతి వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని, కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థలు రాజ్యాంగ విశ్వాసానికి సమాన బాధ్యులుగా ఉంటాయని పేర్కొన్నారు. వివాదాల పరిష్కారంలో పౌరులకు సుప్రీంకోర్టు అండగా ఉంటుందని, వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కోర్టులు తమకు అండగా ఉంటాయనేది వారికి తెలుసని అన్నారు. న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటుందని, అందుకే ప్రజల నమ్మకాన్ని అది పొందుతోందని అన్నారు. ప్రజల నమ్మకాన్ని పొందుతున్న కారణంగానే మన న్యాయ వ్యవస్థ ప్రత్యేకమైనదిగా నిలుస్తోందన్నారు.