న్యూఢిల్లీ: యూకేలో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్ తన రూపం మార్చుకొని వేగంగా వ్యాప్తి చెందుతోంది. సోమవారం ఒక్క రోజే బ్రిటన్‌లో 24 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యూకే నుంచి వచ్చే ఫ్లయిట్‌లపై భారత్ సహా పలు దేశాలు నిషేధం విధించాయి. లండన్ నుంచి మన దేశానికి తిరిగి వచ్చిన వారిలో 8 మందికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో వారిని ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపారు. నెగిటివ్‌గా తేలిన వారికి కూడా వారం పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్స్‌లో ఐసోలేషన్‌లో ఉంచనున్నారు. కొత్త రకం కరోనా వైరస్ పై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా 2.0 గురించి ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
‘వైరస్ రూపం మార్చుకోవడం మామూలే. అయితే మనం త్వరగా స్పందించడం ముఖ్యం. ఇప్పటికే తయారు చేసిన వ్యాక్సిన్‌లపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. మన దేశంలో ఈ కొత్త రకం కరోనా వైరస్‌ను పరీక్షించడానికి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది. యూకేలో మ్యూటెంట్ పాజిటివ్‌లు ఎక్కువవుతున్నాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది’ అని గులేరియా చెప్పారు. ‘భారత్‌లో చాలా రకాల వైరస్ స్ట్రెయిన్స్‌ను మేం పరిశీలించాం. అయితే యూకే మాదిరి మ్యూటేషన్‌ను గుర్తించలేదు. మేం దీనిపై లోతుగా పని చేస్తున్నాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలను ఇలాగే కొనసాగిస్తే సరిపోతుంది’ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ఎపిడమాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ డివిజన్‌కు హెడ్ డాక్టర్ సమీరన్ పండా పేర్కొన్నారు.
