- మార్చి చివరకు ఐటీ ఇండస్ట్రీలో 3.75 లక్షల కొత్త జాబ్స్
- ఉద్యోగుల వలస కూడా పెరుగుతోంది
- టీమ్‌లీజ్ డిజిటల్ రిపోర్టు
బెంగళూరు: మన దేశంలోని ఐటీ–బీపీఎం ఇండస్ట్రీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 3.75 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఒక రిపోర్టు తెలిపింది. దీంతో ఈ ఇండస్ట్రీ కల్పించిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 48.5 లక్షలకు చేరుతుందని టీమ్‌లీజ్ డిజిటల్ వెల్లడించింది. ఐటీ–బీపీఎం ఉద్యోగాలలో ఎక్కువ ఫుల్ టైమ్ ఉద్యోగులే ఉంటారని, కాకపోతే కాంట్రాక్ట్ స్టాఫింగ్ జోరందుకుంటోందని ఈ రిపోర్టు పేర్కొంది. మార్చి 2022 నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య 1.48 లక్షలకు పెరుగుతుందని ఈ రిపోర్టులో టీమ్‌లీజ్ డిజిటల్ అంచనా వేస్తోంది. కంపెనీలే కాకుండా వ్యక్తులు కూడా కాంట్రాక్ట్ స్టాఫింగ్ విధానం పట్ల ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కాంట్రాక్ట్ పద్ధతిన జాయినవుతున్న వారిలో 10 నుంచి 15 శాతం మంది ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన వారే ఉండటం గమనించదగ్గదని పేర్కొంది.2021 ఫైనాన్షియల్ ఇయర్లో 13 డిజిటల్ స్కిల్స్‌కు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయని, ఈ జాబ్స్ 7.5 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ డిజిటల్ రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాది డిజిటల్ స్కిల్స్ కాంట్రాక్ట్ జాబ్స్ ఏకంగా 50 శాతం పెరగనున్నట్లు తెలిపింది. డేటా ఇంజినీరింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్‌లో డిమాండ్–సప్లయ్‌ల మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లు వివరించింది. సప్లయ్ ప్రోబ్లమ్ నుంచి బయటపడటానికి కంపెనీలు తమ ఉద్యోగులకు అప్‌స్కిల్లింగ్ ట్రెయినింగ్ చేపట్టనున్నట్లు అంచనా వేసింది. అంతేకాదు, ఉద్యోగుల వలస విషయంలో ఈ ఏడాది రికార్డు సృష్టిస్తోందని, మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగుల వలస రేటు 24 శాతానికి చేరనుందని కూడా టీమ్‌లీజ్ డిజిటల్ హెడ్ సునీల్ సీ చెప్పారు.
