PSLV-C60: నింగిలోకి చేరిన స్పేడెక్స్ శాటిలైట్లు

  • విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన పీఎస్‌‌ఎల్వీ సీ 60
  • డాకింగ్, అన్ డాకింగ్ కోసం శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగం
  • 24 పేలోడ్లు మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ రాకెట్
  • 10 నుంచి 14 రోజుల్లో అనుసంధాన ప్రక్రియ

శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్): స్పేస్ క్రాఫ్ట్స్ డాకింగ్ (అనుసంధానం), అన్ డాకింగ్ (విడదీయడం) కోసం ఇస్రో చేపట్టిన ప్రయోగంలో మొదటి దశ సక్సెస్ అయింది. పీఎస్‌‌ఎల్‌‌వీ–-సీ60 రాకెట్ ద్వారా స్పేస్​క్రాఫ్ట్–ఏ (స్పేడెక్స్​ 01), స్పేస్​క్రాఫ్ట్ – బీ (స్పేడెక్స్​ 02) శాటిలైట్లను ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్‌‌ ధవన్‌‌ స్పేస్‌‌ సెంటర్‌‌ (షార్‌‌) నుంచి సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ప్రయోగం చేపట్టారు. షార్​లోని మొదటి లాంచ్ పాడ్ నుంచి రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. లిఫ్ట్ అయిన 90 నిమిషాల వ్యవధిలోనే స్పేస్​క్రాఫ్ట్​లను నిర్ధిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. 

5 కిలోమీటర్ల నుంచి 3 మీటర్ల దాకా..

భూమి నుంచి 475 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్​క్రాఫ్ట్-ఏ (స్పేడెక్స్​ 01), స్పేస్​క్రాఫ్ట్ - బీ (స్పేడెక్స్​ 02) కక్ష్యలో తిరుగుతుంటాయి. వీటి మధ్య దూరం 5 కిలో మీటర్లు ఉంటుంది. ఇస్రో సైంటిస్టులు షార్ నుంచి స్పేస్ క్రాఫ్ట్​ల మధ్య దూరం తగ్గిస్తూ వస్తారు. దూరం 3 మీటర్ల వరకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత రెండు స్పేస్ క్రాఫ్ట్​లు ఒకదానితో ఒకటి డాకింగ్ (అనుసంధానం) అవుతాయి. ఆ తర్వాత అన్ డాకింగ్ (వీడదీయడం) అవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు 10 నుంచి 14 రోజుల సమయం పడుతుందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. స్పేస్​క్రాఫ్ట్- ఏ (స్పేడెక్స్​ 01)లో హై రిజల్యూషన్ కెమెరాను అమర్చారు. స్పేస్​క్రాఫ్ట్ బీ (స్పేడెక్స్​ 02) లో మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్, రేడియేషన్ మానిటర్ పేలోడ్ ఉన్నాయి. ఈ పేలోడ్​లు భూమిపై ఉన్న సహజ వనరులను పర్యవేక్షిస్తాయి. వృక్ష సంపదపై అధ్యయనం చేస్తాయి. హై రెజ్యులేషన్ కెమెరాతో ఫొటోలు తీసి భూమికి పంపిస్తాయని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. ఇప్పటి దాకా అమెరికా, రష్యా, చైనా మాత్రమే డాకింగ్, అన్ డాకింగ్ ప్రయోగాలు చేపట్టాయి. ఈ ప్రయోగంలో మనం సక్సెస్ అయితే.. నాల్గో దేశంగా ఇండియా నిలుస్తుంది.

10 పేలోడ్స్ యూనివర్సిటీలు, స్టార్టప్స్​వే..

దేశవ్యాప్తంగా ఉన్న పలు విద్యాసంస్థలు, స్టార్టప్స్ తయారు చేసిన 10 పేలోడ్​లు, ఇస్రో అనుబంధ సంస్థలు తయారు చేసిన 14 పేలోడ్‌‌లను సైంటిస్టులు రాకెట్‌‌ నాలుగో స్టేజ్‌‌ (పైభాగం)లో అమర్చారు. పీఎస్‌‌ 4- ఆర్బిటల్‌‌ ఎక్స్‌‌పెరిమెంట్‌‌ మాడ్యూల్‌‌ (పీఓఈఎం)గా వ్యవహరించే ఈ భాగం.. కొన్నివారాల్లో భూమిపై పడిపోతుంది. ఈ వ్యవధిలోనే అందులోని పేలోడ్‌‌లు నిర్ధిష్ట ప్రయోగాలు చేపట్టేలా రూపొందించినట్లు ఇస్రో సైంటిస్టులు తెలిపారు.

స్పేస్​లో ట్రాఫిక్ కారణంగా 2 నిమిషాలు లేట్..

అంతరిక్షంలో ట్రాఫిక్‌‌ జామ్‌‌ వల్లే 2 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. రాకెట్‌‌ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర శాటిలైట్లు అనుసంధానం చెందడం వల్ల రాత్రి 9.58 గంటలకు చేపట్టాల్సిన ప్రయోగాన్ని 10 గంటల 15 సెకన్లకు చేపట్టామన్నారు. కక్ష్యలో ఇలా జరిగి ప్రయోగం ఆలస్యం కావడం ఇదే తొలిసారి కాదని తెలిపారు. 2023లో చంద్రయాన్‌‌-3 మిషన్‌‌ను కూడా కొన్ని నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. స్టార్‌‌లింక్‌‌కు శాటిలైట్​లు  కొన్ని మన దారిలో వస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం స్టార్‌‌లింక్​కు చెందిన 7వేల శాటిలైట్లు భూమి కక్ష్యలో దిగువ భాగంలో ఉన్నాయని తెలిపారు.

ఎందుకీ ప్రయోగం..

చంద్రుడిపైకి అస్ట్రోనాట్లను పంపేందుకు ఇండియా సిద్ధమవుతున్నది. ఇప్పుడు చేపడ్తున్న డాకింగ్, అన్ డాకింగ్ టెక్నాలజీ అనేది గగన్​యాన్ లక్ష్యానికి ఎంతో కీలకం అని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడిపై నుంచి మట్టి నమూనాలు తీసుకురావడంలోనూ ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా, అంతరిక్షంలో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ ఏర్పాటు చేయాలని ఇండియా భావిస్తున్నది. దీనికి కూడా డాకింగ్, అన్ డాకింగ్ ఇన్ స్పేస్ టెక్నాలజీ దోహదపడనున్నది. కామన్ మిషన్ లక్ష్యాలు సాధించేందుకు, మల్టిపుల్ రాకెట్ లాంచ్ ప్రయోగాలకు ప్లాన్ చేసినప్పుడు డాకింగ్ సాంకేతికత ఉపయోగపడుతుందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. ఈ రెండు శాటిలైట్ల బరువు 440 కిలోలు ఉంది.

ప్రయోగం జరిగిందిలా..

సోమవారం రాత్రి 10:00 గంటలకు ప్రయోగకేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ నింగికెగిరింది. రెండు చిన్న స్పేస్ క్రాఫ్ట్ లు, 24 చిన్న ఉపగ్రహాలతో రాకెట్ బయలుదేరింది. రాత్రి 10 గంటల 15 సెకండ్లకు ప్రయాణం మొదలైంది. 15 నిమిషాల తర్వాత రాకెట్ 475 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సెకండ్ వ్యవధితో రెండు స్పేస్ క్రాఫ్ట్​లను భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఈ వ్యవధితో రెండింటి మధ్య 5 కి.మీ. దూరం ఏర్పడింది. భూ కక్ష్యలో మొదలైన స్పేస్ క్రాఫ్ట్ ల ప్రయాణం ఒకే దిశలో ఒకే వేగంతో కొనసాగుతుంది. సైంటిస్టులు రెండింటి మధ్య దూరాన్ని క్రమంగా తగ్గిస్తూ 5 కి.మీ. నుంచి 3 మీటర్లకు చేరుస్తారు. ఆపై రెండు స్పేస్ క్రాఫ్ట్​ల డాకింగ్ ప్రక్రియ మొదలవుతుంది.