తిరువనంతపురం: హాస్టల్ ఫీజు కట్టలేక ఓ చిన్న రూమ్‌లో ఉంటూ టీకేఎం ఇంజనీరింగ్ కాలేజీలో తాను చదువుకున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. కాలేజీకి బస్సులో వెళ్లేందుకు డబ్బుల్లేక డొక్కు సైకిల్‌మీద రోజూ వెళ్లొచ్చినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాను కాలేజీలో స్టడీ టూర్లకు కూడా వెళ్లే వాడిని కాదన్నారు. ఈ వివరాలన్నీ తన ఆటోబయోగ్రఫీలో ఆయన పొందుపరుస్తున్నారు.
నవంబర్‌లో మలయాళంలో ‘నిలవు కుడిచ సింహంగళ్’ అనే పేరుతో ఈ బుక్ రిలీజ్ కానుంది. 59 ఏండ్ల సోమనాథ్.. తన బాల్యం, కాలేజ్ ఎడ్యుకేషన్ ఎలా సాగింది.. ఎవరిని ఆదర్శంగా తీసుకుని ఇస్రో చైర్మన్ స్థాయికి ఎదిగారన్న ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ బుక్‌లో వివరించారు. ఈ బుక్‌ను తన ఆటోబయోగ్రఫీ అని కాకుండా.. స్ఫూర్తిదాయకమైన కథగా పిలుస్తానని సోమనాథ్ చెప్పారు.
ఇంజినీరింగ్ చదవాలా? బీఎస్సీ చేయాలా? అన్నది కూడా తెలియని ఓ సాధారణ, నిరుపేద యువకుడి కథ అని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ లక్ష్యం వైపు ప్రయాణించి ఎలా సక్సెస్ సాధించాలో ఇది చదివి స్ఫూర్తి పొందేలా ఉంటుందని చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. మానసికంగా, శారీరకంగా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని సోమ్‌నాథ్ ఈ సందర్భంగా సూచించారు.
