2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రం.. ఇస్రో ప్రణాళిక

2035 నాటికి భారతదేశం సొంత స్పేస్​ స్టేషన్​ భారత్​ స్పేస్​ స్టేషన్​(బీఏఎస్​)ను నిర్మించనున్నది. ఇందుకోసం ఇస్రో ప్రణాళికలు రూపొందించిందని బెంగళూరులోని యూఆర్​ రావు శాటిలైట్​ సెంటర్​లో జరిగిన కన్నడ సాంకేతిక సదస్సులో కేంద్ర సైన్స్​ అండ్​ టెక్నాలజీ మంత్రి డాక్టర్​ జితేంద్ర సింగ్​ ప్రకటించారు. 

భూమి ఉపరితలానికి 400 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో 52 టన్నుల బరువు ఉండే భారత అంతరిక్ష కేంద్రాన్ని  ఇస్రో ప్రవేశపెట్టనున్నది. అయితే, దానిలోకి ముందుగా ముగ్గురు వ్యోమగాములను పంపనున్నది. దీనిని భవిష్యత్తులో ఆరుగురికి పెంచాలని యోచిస్తున్నది. 

బీఏఎస్​ అనేది లైఫ్​ సైన్సెస్​, మెడిసిన్​ రంగాల్లో శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇచ్చేందుకు, అంతరిక్ష పరిశోధనలను మెరుగుపరిచేందుకు భారత్​ అభివృద్ధి చేస్తున్న మాడ్యులర్​ స్పేస్​ స్టేషన్​. తొలి మాడ్యుల్స్​ను పలు దశల్లో నింగిలోకి పంపించి, ఆ తర్వాత అంతరిక్షంలోనే వాటిని అనుసంధానిస్తారు. 2035 నాటికి స్పేస్​ స్టేషన్​ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్​ లక్ష్యం యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడంతోపాటు అంతరిక్షరంగంలో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడం.

ప్రస్తుతం అంతరిక్షంలో ఒకే స్పేస్​ స్టేషన్​ ఉన్నది. ఈ స్టేషన్​ను నాసా అనేక దేశాల సహకారంతో నిర్మించింది. ప్రస్తుతం చైనా సొంతంగా ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​ను నిర్మిస్తున్నది.