శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు సెలెక్ట్ చేయం!
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ రంజీ ట్రోఫీకి దూరంగా ఉండాలని డిసైడయ్యాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనట్లేదని చెప్పేశాడు. చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె నేషనల్ టీమ్ లో చోటు కాపాడుకోవడం అంత తేలిగ్గా కనిపించడం లేదు. ఇవన్నీ చూస్తుంటే టెస్టు టీమ్‌లో ట్రాన్సిషన్ (సంధికాలం) స్టార్ట్ అయిందనిస్తోంది. యంగ్ స్టార్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ టీమ్ లో భారీ మార్పులకు సీనియర్ సెలెక్షన్ కమిటీ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు సెలెక్ట్ చేయబోమని ఇషాంత్, సాహా, రహానె, పుజారాలకు సెలెక్టర్లు వ్యక్తిగతంగా చెప్పినట్టు సమాచారం. ఈ రంజీ సీజన్‌లో బాగా పెర్ఫామ్ చేస్తే పుజారా, రహానె తిరిగి టీమ్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ, ఫ్యూచర్ సిరీస్‌లకు కూడా కన్సిడర్ చేయబోమని లంబూ, సాహాకు సెలెక్టర్లు స్పష్టం చేశారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే వీళ్లు రంజీలకు కూడా దూరంగా ఉండాలని డిసైడయ్యారు. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల కీపర్ పంత్ కు స్టాండ్ బైగా కేఎస్ భరత్ కు టెస్టుల్లో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు టెస్టు టీమ్‌లో బుమ్రా, షమీ, సిరాజ్ టాప్-3 పేసర్లుగా ఉండగా.. పేస్ ఆల్ రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్, ఐదో బౌలర్‌గా ఉమేశ్ యాదవ్ అందుబాటులో ఉన్నారు. అలాంటప్పుడు ఇషాంత్ బదులు.. ఆవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, ఇషాన్ పోరెల్ లాంటి యంగ్ పేసర్లలో ఒకరిద్దరినీ టీమ్‌లోకి తీసుకొని పరీక్షించాలని చూస్తోంది.
