SMAT: శివాలెత్తిన ఇషాన్ కిషన్.. 94 పరుగుల లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేజ్ చేశారు

ఐపీఎల్ ముందు సన్ రైజర్స్ అభిమానులకు శుభవార్త. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లోనే 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కిషాన్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. జార్ఖండ్  తరపున ఆడుతున్న కిషాన్ అరుణ చల్ ప్రదేశ్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. కొడితే బౌండరీ అన్నట్టుగా అతని విధ్వంసం సాగింది. 

ఈ జార్ఖండ్ డైనమైట్ ధాటికి అరుణ చల్ ప్రదేశ్ విధించిన 94 పరుగుల లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేజ్ చేయడం విశేషం. ఇటీవలే  ఆదివారం(నవంబర్ 24) జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. 2022లో జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అతనిని రూ. 15.25 కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కుంది. కిషాన్ ఇన్నింగ్స్ సన్ రైజర్స్ అభిమానులకు సంతోషాన్ని ఇస్తుంది. 

ఏడాది కాలంగా కిషాన్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. ఇదే క్రమంలో పేలవ ఫామ్ తో భారత జట్టులో స్థానం కోల్పోయాడు. ఇటీవలే   ఆస్ట్రేలియా ఏ తో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్ ల కోసం జట్టులో ఎంపికయ్యాడు. కిషాన్ 105 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 28.43 సగటుతో 2,644 పరుగులు పరుగులు చేశాడు. వీటిలో 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2018 నుంచి 2023 వరకు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ప్లేయర్ గా ఎదిగాడు.