యాసంగి నీటి విడుదలకు యాక్షన్​ప్లాన్​

  • ఏప్రిల్  15 వరకు నీటి విడుదల 
  • జూరాల కింద15వేలు, నెట్టెంపాడు కింద 20వేలు, ఆర్డీఎస్  కింద 37 వేల ఎకరాలకు సాగునీరు

గద్వాల, వెలుగు: నడిగడ్డలోని జూరాల, నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్, ఆర్డీఎస్  నుంచి యాసంగికి వారబందీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇరిగేషన్  ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు ప్రధాన ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి ఆయకట్టుకు కాకుండా, నిర్దేశించిన ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్  ఆఫీసర్లు తెలిపారు.

జూరాల ప్రాజెక్టు పరిధిలో నాలుగు రోజులు నీటిని విడుదల చేసి మూడు రోజులు బంద్  చేస్తారు. నెట్టెంపాడు కింద నాలుగు రోజులు వరుసగా నీటిని విడుదల చేసి, ఆరు రోజులు బంద్  చేయనున్నట్లు జూరాల ఎస్ఈ రహీముద్దీన్  తెలిపారు. ఆర్డీఎస్  కింద అవసరాన్ని బట్టి ఇండెంట్  పెట్టుకొని సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ మూడు ప్రాజెక్టులకు యాసంగి సీజన్  కోసం ఏప్రిల్ 15 వరకు నీటిని విడుదల చేయనున్నారు.

మూడు ప్రాజెక్టుల కింద 62 వేల ఎకరాలకే..

యాసంగి సీజన్​లో జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్  పరిధిలోని 62 వేల ఎకరాలకు వారబందీ పద్ధతిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టు పరిధిలోని 15 వేల ఎకరాలకు డి31 కెనాల్​ నుంచి గద్వాల మండలం అనంతపురం వరకు నీటిని విడుదల చేయనున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్  పరిధిలో 20 వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు ఇందులో రైట్  కెనాల్  పరిధిలోని 105 ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీ 5 వరకు 15 వేల ఎకరాలు, లెఫ్ట్  కెనాల్  పరిధిలోని 5 వేల ఎకరాలకు వారబందీ పద్ధతిలో సాగునీరు అందించనున్నారు. 

ఆర్డీఎస్  కింద డి30 వరకు 37 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఆర్డీఎస్  కింద తుంగభద్ర బోర్డు 5.9 టీఎంసీల అలకేషన్  ఉండగా, దాని ఆధారంగా ఆర్డీఎస్  కింద ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే ఫస్ట్  ఫేస్ లో 1.08 టీఎంసీలు ఇండెంట్  పెట్టి తీసుకున్నారు. రెండో విడతలో 1.04 టీఎంసీల నీటిని తీసుకునేందుకు ప్లాన్​ చేస్తున్నారు.

 

మొత్తం ఆయకట్టు 2.66 లక్షల ఎకరాలు..

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.42 లక్షల ఎకరాలు, జూరాల ప్రాజెక్టు పరిధిలోని రైట్  కెనాల్  కింద 37 వేల ఎకరాలు, ఆర్డీఎస్  కింద 87 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో జూరాల కింద 15వేల ఎకరాలు, నెట్టెంపాడు కింద 20 వేల ఎకరాలు, ఆర్డీఎస్  కింద 37 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించనున్నారు.

ఆరుతడి పంటలు సాగు చేయాలి..

రైతులు యాసంగిలో ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలి. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆధారంగా సాగునీరు అందిస్తాం. వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలి. ఇరిగేషన్  ఆఫీసర్లకు రైతులు సహకరించాలి. సూచించిన డిస్ట్రిబ్యూటర్ల వరకు మాత్రమే పంటలు సాగు చేసుకోవాలి.- రహీముద్దీన్, ఎస్ఈ, జూరాల