ప్రాజెక్ట్​ల్లో పుష్కలంగా నీరు..వరి సాగుకు జిల్లా రైతులు మొగ్గు

  • యాసంగిలో 3.50 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
  • ప్రాజెక్టుల కింద 60 వేలు,  చెరువుల కింద 35 వేల ఎకరాలు  
  •  బోర్ల కింద 1.55 లక్షల ఎకరాల సాగు

కామారెడ్డి, వెలుగు : యాసంగిలో కామారెడ్డి జిల్లా రైతులు వరి పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా ప్రాజెక్టుల్లో సాగునీరు పుష్కలంగా ఉండడం, చెరువుల్లోనూ నీటి నిల్వలతో భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో సాగునీరు అందుతుందని,  బోర్ల కింద కూడా వరి పంట సాగుకే ఆసక్తి చూపుతున్నారు.  యాసంగి సీజన్​లో జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.  ఇందులో 60వేల ఎకరాల వరకు ప్రాజెక్టుల కింద, మరో  35 వేల ఎకరాలు చెరువుల కింద,  1.55 లక్షల ఎకరాలు బోర్ల కింద సాగయ్యే అవకాశం ఉంది.  

గత వానాకాలం చివరిలో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలో ప్రధానంగా  సాగు నీటి వనరులైన  నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులు ఉన్నాయి.  ప్రస్తుతం నిజాంసాగర్​ ప్రాజెక్టులో  17.629 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఇందులో 10 టీఎంసీలను యాసంగి పంటల సాగుకు విడుదల చేయనున్నారు.  ప్రాజెక్టు కింద 1,25,571 ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇందులో కామారెడ్డి జిల్లాలోని జుక్కల్,  బాన్సువాడ నియోజక వర్గంలోని మండలాలకు కేవలం ​45వేల ఎకరాలకు సాగు నీరందనుంది. మిగతా 80 వేల ఎకరాల ఆయకట్టు నిజామాబాద్​ జిల్లా పరిధిలో ఉంది. ఈ ప్రాజెక్టు కింద ప్రధానంగా వరి పంట సాగు చేస్తున్నారు.  ఇప్పటికే బాన్సువాడ ఏరియాలో నాట్లు షూరు అయ్యాయి. 

నీటి విడుదలకు తైబందీ

నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులో ప్రస్తుతం 1.65 టీఎంసీలు ఉంది.  యాసంగిలో ఏ జోన్​ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు తైబందీ నిర్వహించారు.  ఆన్​ఆఫ్​ పద్ధతిలో వచ్చే జనవరి 1 నుంచి 5 విడతల్లో నీటిని విడుదల చేస్తారు.  ఈ ప్రాజెక్టు కింద నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో 10,500 ఎకరాల ఆయకట్టు ఉంది.  20వేల ఎకరాల వరకు సాగు కానుంది.  ప్రాజెక్టు ఆయకట్టు ఏ, బి జోన్లుగా విభజించారు.  వానాకాలంలో రెండు జోన్లకు నీటిని ఇస్తారు. యాసంగిలో ఒక ఏడాది ఏ జోన్​, మరో ఏడాది బి- జోన్​కు నీటి విడుదల ఉంటుంది.

ఈసారి ఏ జోన్​ పరిధిలోని 6,700 ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. 5 షెడ్యుల్స్​ ప్రకారం నీటి విడుదల ఉంటుంది.  ఫస్ట్​ విడత 2025 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 వరకు, రెండో విడత జనవరి 26 నుంచి ఫిబ్రవరి 9 వరకు, మూడో విడత ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు, నాలుగో విడత మార్చి 17 నుంచి 31 వరకు, 5వ విడత ఏప్రిల్​ 15 నుంచి 20 వరకు నీటిని విడుదల చేస్తారు. 

బోర్ల కింద సాగు 

యాసంగిలో 3.5‌‌‌‌‌‌‌‌లక్షల ఎకరాల వరకు పంటలు సాగు కానుండగా ఇందులో  53,767 ఎకరాల్లో శనగ పంట వేశారు.  మక్క సాగు 19,500 ఎకరాలు ఉంది.    బోర్ల కింద 1. 55 లక్షల ఎకరాల్లో సాగు కానుంది.  కామారెడ్డి, దోమకొండ,  భిక్కనూరు, సదాశివనగర్, మాచారెడ్డి, రాజంపేట, గాంధారి, రామారెడ్డి, తాడ్వాయి,  బీబీపేట, పాల్వంచ మండలాల్లో  అధిక విస్తీర్ణం వరి బోర్ల కింద సాగవుతుంది.   కోతులు, అడవి పందుల  బెడద లేకపోవడం, కొనుగోళ్లలోనూ ఇబ్బందులు లేకపోవడంతో రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు.   

కాల్వ వస్తుందని వరి వేస్తున్నాం

నిజాంసాగర్​ ప్రాజెక్టు నిండింది.  యాసంగిలో కూడా నీళ్లు విడుదల చేశారు.  కాల్వ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం ఉన్నందున వరి పంటను సాగు చేస్తున్నాం.   రెండు  ఎకరాల్లో వరి పంట వేస్తున్నా.  

– రాజయ్య, రైతు- నిజాంసాగర్​