నిజాం పాలనలో నీటిపారుదల సౌకర్యాలు, వైద్య సదుపాయాలు

ఆరో నిజాం మీర్​ మహబూబ్​ అలీఖాన్​, ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​లు నీటిపారుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ముఖ్యంగా ఏడో నిజాం మీర్ ఉస్మాన్​ అలీఖాన్​ ప్రతిభ కలిగిన నవాబు అలీ నవాజ్ జంగ్​ను రాజ్య ప్రధాన ఇంజినీర్​గా నియమించారు. ఇంతకు ముందున్న చెరువులను, కాలువలను, ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున మరమ్మతులు చేయడంతోపాటు కొన్ని ప్రాజెక్టులను కట్టించారు. 

మీర్​ఆలం ట్యాంక్​(1810) :  మూడో నిజాం రాజు సికిందర్​జా ప్రధాన మంత్రి మీర్​ఆలం హైదరాబాద్​ నగరంలో మీఆర్​ ఆలం ట్యాంక్​ నిర్మించారు. ఈ ట్యాంక్​ ప్రస్తుతం నెహ్రూ జూపార్క్​కు నీటిని అందిస్తుంది. 

ఘన్​పూర్​ ఆనకట్ట(1905) : 1905లో మెదక్​ జిల్లా ఘన్​పూర్​ దగ్గరలో మంజీరానదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు 21,625 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నది. 

అసఫ్​నహర్​ ప్రాజెక్ట్​(1905) : ఈ ప్రాజెక్టును నల్లగొండ జిల్లాలో నెమలి కాల్వ గ్రామంలో మూసీ నదిపై నిర్మించారు. ఇది 15,245 ఎకరాలకు నీరు అందిస్తున్నది. 

ఉస్మాన్​సాగర్​/ గండిపేట, హిమాయత్​సాగర్​ (1927): ఈ రెండు ప్రాజెక్టులను ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ కట్టించాడు. 1908లో మూసీ నదికి వరదలు రావడం వల్ల జరిగిన ప్రాణ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నీటిని హైదరాబాద్​ పట్టణవాసుల తాగునీటి అవసరాలు తీర్చడం కోసం, నగరానికి 20 కి.మీ. ఎగువన మూసీ నదిపై ఉస్మాన్​సాగర్​ను నిర్మించారు. మూసీ ఉప నది అయిన ఈసా నదిపై తన ఏడో నిజాం పెద్ద కుమారుడైన హిమాయత్​ అలీఖాన్​ పేరున 1927లో హిమాయత్​సాగర్​ను నిర్మించాడు. ప్రస్తుతం ఉస్మాన్​సాగర్​​, హిమాయత్​సాగర్​లు హైదరాబాద్​ పట్టణవాసుల తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. 

బెలాల్​ ప్రాజెక్టు (1924–29) :  ఈ ప్రాజెక్టును నిజామాబాద్​ జిల్లాలోని బోధన్​ తాలూకాలో రూ.1,28,000 వ్యయంతో 1,265 ఎకరాలకు సాగునీటిని అందించడం కోసం నిర్మించారు. 

పోచారం రిజర్వాయర్​ (1922) : ఈ రిజర్వాయర్​ నిజామాబాద్​ జిల్లాలోని పోచారం గ్రామంలో ఆలేరు ఉపనదిపై రూ.34 లక్షలతో 13,000 ఎకరాలకు సాగునీటిని అందించడం కోసం నిర్మించారు. 

రాయంపల్లి రిజర్వాయర్​ (1924) : ఈ రిజర్వాయర్​ను మెదక్​ జిల్లాలో రాయంపల్లిలో 1924లో రూ.3లక్షల వ్యయంతో నిర్మించారు. 

నందికొండ-నాగార్జునసాగర్ : ఈ ప్రాజెక్ట్​ను మొదట కృష్ణా నదిపై నందికొండ గ్రామం(నల్లగొండ)లో నిర్మించాలని ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ తన ప్రముఖ ఇంజినీర్​ జాఫర్​ అలీ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఎక్కువ భాగం నీటిని తెలంగాణకు వచ్చేటట్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ తదుపరి కేఎల్​రావు ఆధ్వర్యంలో నందికొండ ప్రాజెక్టును ఇంకా కొంత దిగువకు తీసుకుపోయి ఎక్కువ భాగం అంటే రెండొంతుల నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి పోయేటట్లు చేశాడు. 

గ్రామీణ స్థానిక సంస్థలు 

బ్రిటీష్​ ఇండియాలో స్థానిక సంస్థలను 1884లో లార్డ్​ రిప్పన్​ ప్రవేశపెట్టారు. ఆ ప్రభావం నిజాం రాజ్యంపై పడటంతో నిజాం రాజు 1888లో దస్తూర్​ ఉల్​ అమల్​ చట్టాన్ని జారీ చేశారు. దీన్నే లోకల్​ ఫండ్​ రూల్​ చట్టం అంటారు. ఇది 1889లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం మూడు రకాల బోర్డులు అమలులోకి వచ్చాయి. 

1. సెంట్రల్ బోర్డు 

2. జిల్లా బోర్డు 

3. తాలూకా బోర్డు.

ఈ బోర్డుల కాలపరిమితి 1942 చట్టం ప్రకారం మూడు సంవత్సరాలు. అరవముడి అయ్యంగార్​ కమిటీ సూచన మేరకు 1000 నుంచి 5000ల జనాభా ఉన్న గ్రామాల్లో 1942 చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్థలు నెలకొల్పారు. పంచాయతీ సభ్యులు, సర్పంచ్​ను నామినేటెడ్​ పద్ధతిలో తహసీల్దార్​ సమర్పించిన జాబితా ప్రకారం తాలూకాదార్​ లేదా జిల్లా అధికారి నామినేట్​ చేస్తాడు. వీరి పదవీకాలం మూడేండ్లు. 

నిజాం సాగర్​ ప్రాజెక్ట్​(1924- 1931): ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ నిర్మించిన ప్రాజెక్టుల్లో అతి పెద్దది. ఈ ప్రాజెక్టును పూర్తిగా హైదరాబాద్​ ఇంజినీర్లు కలిసి నిజామాబాద్​ జిల్లాలో అచ్చంపేట గ్రామ సమీపంలో మంజీర నదిపై నిర్మించారు. దీనివల్ల నిజామాబాద్​ జిల్లాలో విస్తారమైన పంటలు పండించడానికి తోడ్పడింది. అంతేకాకుండా చెరుకు పంటలకు నీరందించడం వల్ల నిజాం చక్కెర పరిశ్రమను ఇక్కడ నెలకొల్పారు. ఈ ప్రాజెక్ట్​ 2,75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది.

పాలేర్​ ప్రాజెక్ట్​ (1924-1931): ఈ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో పాలేరు నదిపై నాయికుండ గ్రామంలో నిర్మించారు.

వైరా ప్రాజెక్ట్​ (1923-1930): ఈ ప్రాజెక్టును ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో వైరా నదిపై నిర్మించారు. ఇది 17,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది.

సింగభూపాలం రిజర్వాయర్​ (1919-1940): ఖమ్మం జిల్లాలోని ఇల్లందు తాలూకాలో నిర్మించారు. ఈ రిజర్వాయర్​ 17,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది.

మానేరు రిజర్వాయర్​ (1945-1949): ఈ ప్రాజెక్ట్​ కరీంనగర్​ జిల్లాలోని సిరిసిల్ల తాలూకాలో 18 గ్రామాల్లోని 23,000 ఎకరాలకు నీరు అందిస్తున్నది. ఇది 1076 కిలోవాట్ల విద్యుత్తు కూడా ఉత్పత్తి చేస్తున్నది.

డిండి ప్రాజెక్ట్​ (1943): ఈ ప్రాజెక్ట్​ కృష్ణానది ఉపనది అయిన డిండిపై నల్లొండ జిల్లాలోని దేవరకొండ తాలూకాలో నిర్మించారు. 

వైద్య సదుపాయాలు

ఉస్మానియా మెడికల్​ హైస్కూల్​ను 1846లో నిర్మించారు. ఇదే తర్వాతి కాలంలో 1927లో మెడికల్​ కాలేజీగా మార్పు చెందింది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలను 1908లో ప్రస్తుతం ఉన్న అమీర్​పేటలోని విశాలమైన ప్రదేశంలో నిర్మించారు. నిజామియా జనరల్​ హాస్పిటల్​ను అఫ్జల్​గంజ్​లో 1938లో ఏడో నిజాం నిర్మించాడు. ఇది ఉస్మానియా జనరల్​ హాస్పిటల్​గా మార్పు చేశారు. ఆసియాలోనే ఇది అతిపెద్ద హాస్పిటల్. ఏడో నిజాం నవాబు కోడలు ప్రిన్స్​ నిలోఫర్​ జ్ఞాపకార్థమై నిలోఫర్​ పిల్లల హాస్పిటల్​ను నిర్మించారు.

పురానాపూల్​ బ్రిడ్జి దగ్గరలోని సిటీకాలేజ్​ పక్కన స్త్రీల ప్రసూతి హాస్పిటల్​ నిర్మించారు. నిజాం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(నిమ్స్) మొదట్లో నిజాం నవాబు ట్రస్టు ఆధ్వర్యంలో నడిచేది. ప్రస్తుతం హాస్పిటల్​ ఉన్న విశాలమైన భూభాగమంతా నిజాం నవాబుదే. 1961లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న హాస్పిటల్​ భవనాలను నిర్మించారు. నిజామియా యునాని హాస్పిటల్​ను ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ నిర్మించాడు.