- ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్‌డీఏ ఆదేశం
- కవరేజీ రూ.ఐదు లక్షల వరకు…
- వచ్చే ఏప్రిల్ నుంచి అమలు
న్యూఢిల్లీ: మరింత మందికి ఆరోగ్యబీమా సదుపాయం కల్పించేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) కొత్త నిర్ణయం తీసుకుంది. అన్ని సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు ‘స్టాండర్డ్ హెల్త్ ఇన్సూ పాలసీ’లను తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించింది. ‘ఆరోగ్య సంజీవని’ పేరుతో రూ.ఐదు లక్షల కవరేజీ కలిగిన పాలసీలను తప్పనిసరిగా అమ్మాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త పాలసీలను అమ్మాలని సూచించింది. ‘కంపెనీలు ఇప్పటికే చాలా హెల్త్ పాలసీలను అందిస్తున్నాయి. ఒక్కో దాంట్లో ఒక్కోరకమైన సదుపాయం ఉంటుంది. అందరికీ ఉపయోగపడే సాధారణ బీమా పాలసీని ఎంచుకోవడం చాలా మందికి సాధ్యం కావడం లేదు. అందుకే ‘స్టాండర్డ్ హెల్త్ పాలసీ’ని ఇవ్వడాన్ని ఐఆర్‌డీఏ తప్పనిసరి చేసింది. ఈ పాలసీ ఇన్సూరర్ పేరిట జారీ కావాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది’’ అని అకో జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ రిస్ ఆఫీసర్ బీరేశ్ గిరి అన్నారు.
పాలసీ ముఖ్యాంశాలు
- ఆరోగ్య సంజీవని పాలసీ కొన్న వాళ్లకు హాస్పిటల్, అనస్థీషియా, సర్జన్స్, రూమ్, బెడ్ వంటి చార్జీలు చెల్లిస్తారు.
- రూమ్, బోర్డింగ్, నర్సింగ్ చార్జీలు రోజులో రూ.ఐదు వేలు మించకూడదు. ఐసీయూ, ఐసీసీయూ చార్జీలు రోజుకు రూ.10 వేలకు మించకూడదు.
- ఈ పాలసీకి యాడ్ ఆన్లు, ఆప్షనల్ కవరేజీలను కంపెనీలు ఇవ్వడం సాధ్యం కాదు. మొత్తం కుటుంబ సభ్యులందరికీ కలిపి కూడా పాలసీని తీసుకోవచ్చు.
- ప్రమాదం, గాయాల వల్ల దంతాలు, చర్మం దెబ్బతింటే ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్ ట్రీట్‌మెంట్లు కూడా తీసుకోవచ్చు.
- కేర్ ట్రీట్‌మెంట్స్, అంబులెన్స్ ఖర్చులనూ చెల్లిస్తారు. ఆయుష్ చికిత్సలకూ పాలసీ వర్తిస్తుంది. ప్రి–హాస్పటలైజేషన్,
- పోస్ట్–హాస్పిటలైజేషన్ ఖర్చులకూ పాలసీదారులు అర్హులే! –ఈ స్టాండర్డ్ హెల్త్ పాలసీని ఇవ్వడానికి కంపెనీలు ఐఆర్‌డీఏ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.

