ఐఆర్‌‌సీటీసీ షేర్​.. సీటీ మార్​

ఐఆర్‌‌సీటీసీ షేర్​.. సీటీ మార్​

రూ. వెయ్యి మార్క్‌‌కు చేరువలో షేర్‌‌

ముంబై: ఇండియన్ రైల్వేకి చెందిన సంస్థ ఐఆర్‌‌‌‌సీటీసీ షేరు ధర ఆల్‌‌ టైమ్ గరిష్టాన్ని తాకింది. అక్టోబర్‌‌‌‌లో బంపర్‌‌‌‌ లిస్టింగ్ అనంతరం ఈ కంపెనీ తొలిసారి క్వార్టర్లీ ఫలితాలను ప్రకటించబోతోంది. ఈ నేపథ్యంలో ఐఆర్‌‌‌‌సీటీసీ షేరు ధర ఇంట్రాడేలో 5.20 శాతం పెరిగి రూ.981.35 వద్ద తాజా గరిష్ట మార్క్‌‌ను తాకింది. దీంతో బీఎస్‌‌ఈలో ఐఆర్‌‌‌‌సీటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,575 కోట్లకు పెరిగింది. బీఎస్‌‌ఈలో 2.61 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎన్‌‌ఎస్‌‌ఈలో కూడా 5.14 శాతం పెరిగి రూ.980.90 వద్ద ట్రేడయ్యాయి. చివరికి మాత్రం 1 శాతం నష్టంతో రూ.923.50 వద్ద ఐఆర్‌‌‌‌సీటీసీ షేరు క్లోజైంది.

బీఎస్‌‌ఈ, ఎన్‌‌ఎస్‌‌ఈలో ఈ స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి షేరు ధర పెరుగుతూనే ఉంది. బీఎస్‌‌ఈలో రూ.644 వద్ద, ఎన్‌‌ఎస్‌‌ఈలో రూ.626 వద్ద ఐఆర్‌‌‌‌సీటీసీ షేరు లిస్ట్ అయింది. రూ.644 వద్ద లిస్ట్ అయిన తర్వాత, ఆ రోజు ఇంట్రాడేలో ఐఆర్‌‌‌‌సీటీసీ షేరు ధర రూ.743.80కు చేరుకుంది. ఇంట్రాడేలోనే బీఎస్‌‌ఈలో 15.50 శాతం పెరిగింది. ఎన్‌‌ఎస్‌‌ఈలో అయితే ఏకంగా 18.80 శాతం ఎగిసింది. ఇప్పటి వరకు ఐఆర్‌‌‌‌సీటీసీ షేరు ధర 52 శాతం పెరిగింది. ఎన్‌‌ఎస్‌‌ఈలో ఈ స్టాక్ లిస్టింగ్ ధరకు 56.69 శాతం రిటర్నులను అందిస్తోంది. అక్టోబర్ 9, 10 తేదీల్లో స్టాక్‌‌ అలాట్ అయిన ఇన్వెస్టర్లు 206 శాతం లాభాలు పొందారు.ఇన్వెస్టర్ల నుంచి కూడా ఈ స్టాక్‌‌కు అంతే ఆసక్తి వస్తోంది. అక్టోబర్ 23న తొలిసారి దీని ధర రూ.900ను క్రాస్ చేసింది. ప్రస్తుతం వెయ్యి మార్క్‌‌ కు చేరువలో ట్రేడైంది.

ఐపీఓలో 12.6 శాతం వాటా అమ్మకం…

ప్రభుత్వం డిస్‌‌ఇన్వెస్ట్‌‌మెంట్ ప్రొగ్రామ్‌‌లో భాగంగా ఐఆర్‌‌‌‌సీటీసీని పబ్లిక్‌‌ ఇష్యూకు తీసుకొచ్చింది. ఐఆర్‌‌‌‌సీటీసీలో 100 శాతం వాటా ఉన్న ప్రభుత్వం, దానిలో 12.6 శాతాన్ని అమ్మేసింది. ఐపీఓ తర్వాత ప్రభుత్వం వాటా ఆ సంస్థలో 87.4 శాతమే. ఇంటర్నెట్ టిక్కెటింగ్, కేటరింగ్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ట్రావెల్ అండ్ టూరిజం వంటి పలు కార్యక్రమాలను ఐఆర్‌‌‌‌సీటీసీ చేపడుతోంది. ఇతర వ్యాపారాల్లోకి కూడా ఐఆర్‌‌‌‌సీటీసీ విస్తరించింది. నాన్ రైల్వే కేటరింగ్, సర్వీసులను కూడా అందిస్తోంది.