IPL 2025 Mega Auction: ఆ రెండు రోజులు డబుల్ కిక్: టీమిండియా మ్యాచ్‌తో పాటు ఐపీఎల్ ఆక్షన్

క్రికెట్ అభిమానులకు రెండు రోజులు డబుల్ కిక్ కు సిద్ధంగా ఉండడానికి ఫిక్స్ అయిపోండి. నవంబర్ 22-26 తేదీలలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్ట్ ఆడనుంది. నవంబర్ 24,25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. టెస్ట్ మ్యాచ్ మూడు, నాలుగు రోజులు ఐపీఎల్ మెగా ఆక్షన్ తో క్లాష్ కానుంది. అయితే మ్యాచ్ ఉదయం 7:50 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరో వైపు ఐపీఎల్ ఆక్షన్ మధ్యాహ్నం మొదలవుతుంది. దీంతో ఈ రెండు అభిమానులు ఎంజాయ్ చేయొచ్చు. డిస్నీ స్టార్ హాట్ స్టార్ మ్యాచ్ తో పాటు ఐపీఎల్ ఆక్షన్ ను ప్రసారం చేయనుంది. 

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ 2025 సీజన్ కోసం జరిగే మెగా వేలంలో 1,574 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలానికి రిజిస్ట్రేషన్ గడువు సోమవారంతో  ముగియగా..  1,165  మంది ఇండియా ప్లేయర్లు, 409 మంది విదేశీ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారని బీసీసీఐ సెక్రటరీ జైషా మంగళవారం ప్రకటించారు. ఈ నెల 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని  జెడ్డాలో వేలం జరుగుతుందని తెలిపారు.

వేలానికి రిజిస్టర్ అయిన వారిలో 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1,224  మంది అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్ ప్లేయర్లు, 30 మంది అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. ఇండియా నుంచి 48 మంది క్యాప్డ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఉండగా.. క్యాప్డ్ ఇంటర్నేషనల్ ప్లేయర్లు 272 మంది బరిలో నిలిచారు. అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్ ప్లేయర్లలో 965 మంది ఇండియాకు చెందిన వాళ్లు కాగా.. మరో 104 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.  ఇండియా కాకుండా 16 దేశాల ఆటగాళ్లు వేలానికి వస్తున్నారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.