IPL 2025 auction: ప్రతి జట్టుకు ఐదు రిటెన్షన్స్‌‌.. ఒక ఆర్‌‌‌‌టీఎం ఆప్షన్

  • ఐపీఎల్ 2025 వేలం రిటెన్షన్ పాలసీ ఖరారు..   వచ్చే సీజన్ నుంచి ఆటగాళ్లకు మ్యాచ్‌‌ ఫీజులు

బెంగళూరు:  క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్‌‌ 2025 సీజన్‌‌  వేలం రిటెన్షన్ పాలసీ ఖరారైంది. బీసీసీఐ, టీమ్ ఓనర్ల నుంచి అనేక సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మెగా వేలానికి ముందు ప్రతి జట్టుకు ఐదు రిటెన్షన్స్,  ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌‌‌‌టీఎం) ఆప్షన్‌‌ను ఇవ్వాలని  ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ శనివారం నిర్ణయించింది. 2022 మెగా వేలంలో నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతించారు. ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరగడంతో పాటు ఆర్‌‌‌‌టీఎంను ఉపయోగించే అవకాశం కూడా కల్పించారు. రిటెన్షన్‌‌ పాలసీలో భాగంగా ఒక ఫ్రాంచైజీ తమతోనే కొనసాగించే తొలి ఆటగాడికి (తొలి రిటెన్షన్‌‌) రూ. 18 కోట్లు, రెండో ప్లేయర్‌‌‌‌కు  రూ. 14 కోట్లు, మూడో ఆటగాడికి  రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జట్టు మరో రెండు రిటెన్షన్స్‌‌ కూడా ఉపయోగించాలని నిర్ణయిస్తే నాలుగో రిటెన్షన్స్‌‌కు రూ. 18 కోట్లు, చివరి దానికి రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఓ ఫ్రాంచైజీ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే ఆ జట్టు వేలం ఖాతా (రూ. 120 కోట్లు) నుంచి రూ. 75 కోట్లు మినహాయిస్తారు.  దీంతో మరో 15 మంది ప్లేయర్లను కొనుగోలు చేయడానికి వేలంలో సదరు ఫ్రాంచైజీకి  రూ. 45 కోట్లు మాత్రమే మిగులుతాయి. కాగా, తమ జట్టు ఆటగాడిని  వేరే ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే ఆర్‌‌‌‌టీఎం ఉపయోగించి ఆ మొత్తాన్ని చెల్లించి సదరు ప్లేయర్‌‌‌‌ను తమతోనే  అట్టిపెట్టుకోవచ్చు. రిటెన్షన్‌‌లో  స్వదేశీ, విదేశీ క్రికెటర్లు ఎవరినైనా  ఎంచుకోవచ్చని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.  ఆదివారం జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం రిటెన్షన్‌‌ పాలసీకి ఆమోదం తెలపనుంది.    నవంబర్ రెండో  వారంలో మెగా వేలం తేదీని కూడా ఖరారు చేసే చాన్సుంది. 

ఐసీసీకి బీసీసీఐ ప్రతినిధులు ఎవ్వరు?    

ఐసీసీ సమావేశాలకు ఇండియా నుంచి ఇద్దరు ప్రతినిధులను ఎంపిక చేయడమే ప్రధాన ఎజెండాగా బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఆదివారం జరగనుంది.   ఐసీసీ చైర్మన్‌‌గా ఎన్నికైన  జై షా స్థానంలో బీసీసీఐ కొత్త  సెక్రటరీ ఎంపిక విషయం ఎజెండాలో లేకపోవడం గమనార్హం. ఇక,  ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌‌లోకి  ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) నుంచి ఒక ప్రతినిధి చేరికను బీసీసీఐ ఏజీఎం ఆమోదించనుంది. ప్రస్తుత ప్రతినిధి వి. చాముండేశ్వర్‌‌‌‌ నాథ్‌‌ ఈ పోస్టులో కొనసాగుతాడని తెలుస్తోంది.  జనరల్ బాడీ నుంచి మరో ఇద్దరు ప్రతినిధులుగా ఐపీఎల్ చైర్మన్‌‌ అరుణ్ ధూమల్‌‌, అవిషేక్ దాల్మియాను నామినేట్‌‌ చేయనున్నారు. కాగా, అన్షుమాన్‌‌ గైక్వాడ్‌‌ మరణంతో ఖాళీ అయిన ఐసీఏ ప్రెసిడెంట్ పోస్టును మాజీ టెస్టు క్రికెటర్‌‌‌‌ యజుర్వీంద్ర సింగ్‌‌ చేపట్టనున్నాడు. 2024-–25 సీజన్ వార్షిక బడ్జెట్‌‌,   క్రికెట్ కమిటీ వంటి సబ్-కమిటీల నియామకాలను బీసీసీఐ ఏజీఎం ఆమోదించనుంది.


మ్యాచ్‌‌కు రూ. 7.5 లక్షలు

ఐపీఎల్‌‌ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌‌ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలతో కాంట్రాక్టు ద్వారా భారీ మొత్తం ఆర్జిస్తున్న ఆటగాళ్లకు కొత్తగా మ్యాచ్‌‌ ఫీజులు కూడా అందించాలని నిర్ణయించింది. ఐపీఎల్‌‌ ప్లేయర్లకు ప్రతీ మ్యాచ్‌‌కు రూ. 7.5 లక్షల చొప్పున ఫిక్స్‌‌డ్‌‌ మ్యాచ్ ఫీజు ఖరారు చేసింది. 2025 సీజన్‌‌ నుంచే ఇది అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని  బీసీసీఐ సెక్రటరీ జై షా శనివారం సోషల్ మీడియా వేదికగా శనివారం ప్రకటించారు. ఒక సీజన్‌‌లో అన్ని లీగ్ మ్యాచ్‌‌లు ఆడే క్రికెటర్‌‌కు రూ. 1.05 కోట్ల మొత్తం లభిస్తుంది. ఆ ఫ్రాంచైజీతో తను ఒప్పందం చేసుకున్న మొత్తానికి ఇది అదనం. మ్యాచ్‌‌ ఫీజుల కోసం ఒక్కో ఫ్రాంచైజీ సీజన్‌‌కు రూ. 12.60 కోట్లు కేటాయిస్తుంది. ఫ్రాంచైజీలకు గతంలో పోలిస్తే ఎక్కువ ఆదాయం  వస్తున్నందున ఆటగాళ్లను ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన అవసరం గురించి ఐపీఎల్, బోర్డు పెద్దలు ఆయా  జట్లను ఒప్పించి ఈ కొత్త పాలసీని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.