ఎంఎస్ ధోనీకి అంపైర్ భయపడ్డాడా?

ఎంఎస్ ధోనీకి అంపైర్ భయపడ్డాడా?

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి మిస్టర్ కూల్ అనే బిరుదు ఉంది. దీనికి తగ్గట్లే మైదానంలో ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మహేంద్రుడు ప్రశాంతంగా ఉంటూ టీమ్‌‌ను కూల్‌‌గా ఉంచుతుంటారు. అయితే ఐపీఎల్ పదమూడో సీజన్‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌‌‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో ధోనీలోని అగ్రెసివ్‌‌నెస్ కనిపించింది. ఎస్‌‌ఆర్‌‌హెచ్ ఇన్నింగ్స్‌‌లో 19వ ఓవర్‌‌ను శార్దూల్ ఠాకూర్ వేశాడు. 11 బంతుల్లో 24 రన్స్ అవసరమైన దశలో శార్దూల్ ఫుల్ లెంగ్త్ బాల్‌‌ను వేశాడు. ఈ బాల్ బ్యాట్స్‌‌మన్‌‌కు దూరంగా వైడ్‌‌గా వెళ్లింది. అయితే ఈ బాల్‌‌ను అంపైర్ పాల్ రీఫెల్ వైడ్ ఇవ్వడానికి వెళ్తుండగా అతడి వైపు ధోని సీరియస్‌గా చూస్తూ వాదించాడు. దీంతో రీఫెల్ తన నిర్ణయాన్ని మార్చుకొన్నాడు. దీనిపై అంపైర్ రీఫెల్‌‌ను క్రికెట్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ధోనీకి అంపైర్ భయపడ్డాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై సీనియర్ క్రికెటర్లు ఇయాన్ బిషప్, దీప్ దాస్ గుప్తా స్పందించారు.

‘అంపైర్ రీఫెల్ ఆ బాల్‌‌ను వైడ్‌‌గా ప్రకటించాలనుకున్నాడు. దాదాపుగా వైడ్ ఇవ్వబోయాడు. కానీ అకస్మాత్తుగా ఏదో జరిగింది. అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు’ అని కామెంటేటర్ దీప్‌‌దాస్ గుప్తా చెప్పాడు. ‘అంపైరింగ్ కష్టం కాబట్టి నేను అంపైర్ల మీద జాలి చూపిస్తా. కానీ పాల్ రీఫెల్ తప్పు చేశాడు. అతడు బంతిని చూశాడు. అది కచ్చితంగా వైడ్. దాన్ని వైడ్‌‌గా ప్రకటించాల్సింది. అతడు ధోనీని చూసి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు’ అని విండీస్ క్రికెటర్, కామెంటేటర్ బిషప్ పేర్కొన్నాడు.