రేషన్ మాఫియా డాన్ సహా ముఠా అరెస్ట్

  • వెహికల్ బోల్తాతో వెలుగులోకి 
  • రేషన్ బియ్యం అంతర్రాష్ట్ర దందా 
  • మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు

మిర్యాలగూడ, వెలుగు : మాఫియా డాన్ తో పాటు అతనికి సహకరించే అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా వాడపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.  సాయంత్రం మిర్యాలగూడ డీఎస్పీ ఆఫీస్ లో మీడియా సమావేశంలో వివరాలను డీఎస్పీ రాజశేఖర రాజు తెలిపారు.  ఏపీలోని దాచేపల్లి కి చెందిన మందపాటి నర్సింహారావు,  కల్లూరి లింగయ్య, దేవరకొండ అమ్మోరయ్య, సైదారావు, సర్దార్ ముఠాగా ఏర్పడ్డారు. కొంతకాలంగా మిర్యాలగూడ, దామరచర్ల ప్రాంతాల్లో  కొందరు దళారులను నియమించుకొని తక్కువ ధరకు కొనుగోలు చేసిన టన్నుల కొద్ది రేషన్ బియ్యాన్ని గుట్టుగా అర్ధరాత్రి వేళ మరికొందరితో కలిసి ఏపీకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. 

కేసులు నమోదైనా ముఠా తప్పించుకుంటుంది. కాగా.. కొద్దినెలల కింద ముఠాలో సభ్యుడైన దామరచర్ల మండలం బండావత్ తండాకు చెందిన బండావత్ సర్దార్ ఇంటినుంచి అశోక్ లేల్యాండ్ మినీ వ్యాన్ లో  పీడీఎస్ బియ్యం లోడ్ ను గత అక్టోబర్ 24న ఏపీకి తరలిస్తుండగా.. దామరచర్ల పరిధి నర్సాపురం క్రాస్ రోడ్డు వద్ద  ప్రమాదవశాత్తూ వాహనం బోల్తా పడింది. ఇందులో వెళ్తున్న షేక్ నాగుల్ అనే కూలీకి తీవ్రగాయాలై మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు ఎంక్వైరీ చేయగా పీడీఎస్  బియ్యం ముఠా అంతరాష్ట్ర దందా సాగిస్తున్నట్లు తేలింది. 

పరారీలో ఉన్న డాన్ మందపాటి నర్సింహారావుతో సహా ముఠా రేషన్ అక్రమ రవాణాపై ఇదే ఏడాది వాడపల్లి పీఎస్ లో 6, మిర్యాలగూడ రూరల్, టూ టౌన్ స్టేషన్లు కలిపి మొత్తం 8 కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. ఏపీకి మిర్యాలగూడ, దామరచర్ల ప్రాంతాల నుంచి  రేషన్ బియ్యం కొనుగోలు, రవాణా  చేసేందుకు సహకరిస్తున్న వారి వివరాలు సేకరించి వారిపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  ఈ సమావేశంలో సీఐ వీరబాబు, ఎస్ ఐలు హరికృష్ణ, శేఖర్, సిబ్బంది ఉన్నారు.