భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎక్స్​పైరీ పరికరాలతో ప్రాక్టికల్స్​ కష్టాలు

  • ఒకేషనల్​ స్టూడెంట్స్​ పరిస్థితి మరీ దారుణం
  • రెండు దశాబ్దాల నాటి పరికరాలతోనే ప్రాక్టికల్స్​
  •  ఎక్స్​పైరీ అయిన రసాయనాలతోనే సరిపెడుతున్న ఫ్యాకల్టీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఇంటర్మీడియట్​ స్టూడెంట్స్​ ప్రాక్టికల్స్​ కు సరైన సౌకర్యాలు, పరికరాలు లేవు.   ఒకేషనల్​ స్టూడెంట్స్​ పరిస్థితి మరీ దారుణంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల కాలం నాటి మూలకు పడిన పరికరాలతో అధికారులు మమ అనిపిస్తున్నారు. థియరీకే ప్రాధాన్యం  ఇస్తూ  ప్రాక్టికల్స్​ను పట్టించుకోవడం లేదు.  

ఎక్స్​పైరీ​ కెమికల్స్​తోనే ప్రాక్టికల్స్.. 

ఇంటర్​ విద్యార్థులకు ఏటా  ఫిబ్రవరిలో ప్రాక్టికల్​ ఎగ్జామ్స్​ ఉంటాయి.  అక్టోబర్​ నుంచే ప్రాక్టికల్స్​ మొదలు పెట్టాల్సి ఉంది.  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 14 సర్కార్​ జూనియర్​ కాలేజీలున్నాయి. జిల్లాలో గవర్నమెంట్​, కస్తూర్బా, ట్రైబల్​ వెల్ఫేర్​, సోషల్​ వెల్ఫేర్​, బీసీ వెల్ఫేర్​, టీఎస్​ ఆర్జేసీ, మైనార్టీకాలేజీల్లో దాదాపు ఐదే వేల మంది ఫస్ట్​ ఇయర్​, 5,500 మందికి పైగా సెకండ్​ ఇయర్​ స్టూడెంట్స్ ఉన్నారు.   ప్రైవేట్​లో  ఫస్ట్​ ఇయర్​ లో దాదాపు 4,700మందికి  పైగా, సెకండ్​ ఇయర్​లో 4,876 మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు.

 ఇంటర్మీడియట్​లో ఫిజిక్స్​, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీ సబ్జెక్ట్​లతో పాటు ఒకేషనల్​కోర్సులలో అక్టోబర్​ నుంచి ప్రాక్టికల్స్​ ప్రారంభం కావాల్సి ఉంది. గవర్నమెంట్​ కాలేజీల్లో మాత్రం అరకొరగా ప్రాక్టికల్స్​ మొదలు పెట్టారు. కానీ ప్రైవేటు కాలేజీల్లో ప్రాక్టికల్స్​కు సంబంధించిన ల్యాబ్​ల తాళాలు ఇంకా తెరుచుకోలేదు. ఫిజిక్స్ ల్యాబ్​లో   పాతకాలం నాటి  పరికరాలతో ప్రాక్టికల్స్​  చేపిస్తున్నారు. ప్రాక్టికల్స్​లో  ప్రధానంగా ఉపయోగించే  పరికరాలు, కెమికల్స్​ పూర్తిగా  అందుబాటులో లేవు. ఉన్న వeటిలో చాలా వరకు ఎక్స్​పైరీ​ అయినవే.  

 జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని జూనియర్​ కాలేజీలో ల్యాబ్​లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకేషనల్​ విభాగంలో కొన్ని పరికరాలున్నప్పటికీ లెక్చరర్లు మాత్రం వాటిని ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  బొటనీ, జువాలజీ​ విభాగంలో అందుబాటులో ఉన్న పరికరాలతో ప్రాక్టికల్స్​ చేపిస్తున్నారు.  దీంతో కేవలం ప్రాక్టికల్స్​కు సంబంధించిన రికార్డులతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. 

రెండు దశాబ్దాల కాలం నాటివే  

 ఒకేషనల్​ కోర్సులు చదివే స్టూడెంట్స్​ పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు దశాబ్దాల కాలంలో ఒకేషనల్​ కోర్సులకు సంబంధించి ఎటువంటి మెటీరియల్​ను గతంలోని ప్రభుత్వాలు సమకూర్చలేదు. ఓకేషనల్​ కోర్సుల్లో  ప్రధానంగా ఆటో మొబైల్స్​ ఇంజినీరింగ్​, ఆటోమొబైల్స్​ టెక్నీషియన్స్​, కన్​స్ట్రక్షన్​ టెక్నాలజీ, కంప్యూటర్​ సైన్సెస్​, మెకానికల్​ ఇంజినీరింగ్​,మెడికల్​ ల్యాబ్​ టెక్నీషియన్​, లైఫ్​ మేనేజ్​మెంట్​ అండ్​ డైరీ టెక్నాలజీ వంటి కోర్సులు   ఉన్నాయి. కానీ ఆయా కోర్సులకు సంబంధించి పరికరాలు  లేక, లెక్చరర్లు థియరీతోనే సరిపెట్టుకుంటున్నారు.