పంక్చర్ చేసినట్లుగా రోడ్డు రిపేర్

పంక్చర్ చేసినట్లుగా రోడ్డు రిపేర్

చిన్నపాటి వర్షానికే రోడ్లు అధ్వాన్నంగా మారుతుంటాయి. అక్కడక్కడ గుంతలు ఏర్పడడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. పల్లె, పట్ణణం అనే తేడా లేకుండా రహదారులు గుంతలమయం అవుతుంటాయి. ఈ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారుల ఒళ్లు హునమౌతుంటాయి. ప్రధాన రహదారులు అధ్వాన్నంగా మారిపోతాయి. వాటిని బాగు చేయకపోవడంతో ప్రజలు నిత్యం నరకం చూస్తుంటారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. దీనికి పరిష్కారంగా ప్రముఖ ఫార్మా సంస్థ బయోకాన్ ( Biocon Limited) ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar-Shaw) కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు.

ఆసక్తికరమైన టెక్నాలజీ ఇది అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ట్వీట్ లో @BBMPAdmn ను ట్యాగ్ చేశారు. బెంగళూరు నగరంలో రోడ్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆమె పోస్టు చేసిన వీడియోలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేస్తున్నారు. టైర్ కు పంక్చర్ అయితే.. ప్యాచ్ ఎలా వేస్తామో.. గుంతల పడిన రోడ్డుపై ప్యాచ్ వేయడం కనిపించింది. దెబ్బతిన్న చోట ఓ షీట్ వేశారు. అనంతరం బరువుతో కూడిన ఓ దానిని తీసుకుని ప్యాచ్ పై చదును చేశారు. ప్యాచ్ షీట్ కు ఓ వైపు గమ్ ఉంటుంది. స్టిక్కర్ మాదిరిగానే రోడ్డుపై అతికించారు. అమెరికన్ రోడ్డు ప్యాచ్ గా పిలుస్తారని సమాచారం. సాధారణ తారు రోడ్లకే కాకుండా కాంక్రీటు రోడ్ల ప్యాచ్ లకు సైతం వినియోగించవచ్చంటున్నారు. రోడ్లు రిపేర్ చేసే సమయంలో వాహనాలను నిలిపివేస్తుంటారు.  ఈ కొత్త టెక్నాలజీ ద్వారా కేవలం నిమిషాల్లోనే రోడ్డు రిపేర్ అవుతుంది.