9 నెలల నుంచి ప్రెగ్నెన్సీ అని నమ్మించింది.. అసలు విషయం తెలిసి అవాక్కయిన డాక్టర్లు..!

వరంగల్: జనగామ జిల్లాలో ఓ మహిళ తీరు వివాదాస్పదమైంది. 9 నెలలుగా తాను గర్భవతి అయినట్టు అందరిని నమ్మించి మహిళ మోసం చేసిన ఉదంతం వెలుగుచూసింది. పాలకుర్తి మండలంలోని మొండ్రాయి తండాకు చెందిన ధరావత్ పల్లవి అనే వివాహిత 9 నెలల నుంచి ప్రెగ్నెన్సీ వచ్చిందంటూ కుటుంబ సభ్యులతో పాటు అందరిని నమ్మించింది. ఈరోజు నొప్పులు వస్తున్నాయంటూ చికిత్స కోసం జనగామ ఎంసిహెచ్ ఆసుపత్రికి రాగా మల విసర్జనకు వెళ్లిన మహిళ అర గంట తర్వాత తనకు బాత్రూంలోనే అబార్షన్ అయిందని బాబు పుట్టి డ్రైనేజీలో పడిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. 

బాత్రూం పరిసరాల్లో ఆసుపత్రి సిబ్బంది ఎంత వెతికినా అలాంటి ఆనవాళ్లు కనబడకపోవడంతో సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. మహిళ ప్రవర్తన చూసి అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సదరు మహిళ అసలు గర్భవతే కాదని తెలవడంతో డాక్టర్లు అవాక్కయ్యారు. ఎంసిహెచ్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు మహిళను పోలీసులు విచారించారు. అసలు ఆమె ఎందుకు ఇలా అబద్ధం చెప్పి అందరినీ నమ్మించిందనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. కారణం తెలియాల్సి ఉంది.