పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు : కలెక్టర్ సీతారామారావు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి 2.30 నుంచి  సాయంత్రం 5.30 వరకు  కొనసాగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తు ఉండేలా చూడాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రంలో తప్పనిసరిగా మంచి నీటి వసతి అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో మొత్తం 21 పరీక్షా కేంద్రాల్లో ఫస్టియర్​లో 4,037 మంది, సెకండియర్​లో 2,511 మంది ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాయనున్నారని తెలిపారు.  

వనపర్తి టౌన్: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లో ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని వనపర్తి డీఐఈఓ మద్దిలేటి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీలో ఆయన మాట్లాడారు. వనపర్తి జిల్లాలో మొత్తం 13 సెంటర్లు ఏర్పాటు చేశామని, ఫస్టియర్ లో 3,978 మంది, సెకండియర్ లో 2,156 మంది పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జామ్స్ కమిటీ  మెంబర్స్ ప్రకాశం శెట్టి,  శ్రీనివాసులు, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.