- కాలియర్స్ ఇండియా రిపోర్టు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో రియల్ ఎస్టేట్‌లో కంపెనీల పెట్టుబడులు రెండు రెట్లు పెరిగాయి. మార్చి 2022 చివరి నాటికి ఇన్స్టిట్యూషనల్ పెట్టుబడులు రూ. 8,375 కోట్లకు (1.1 బిలియన్ డాలర్లు) చేరడం విశేషం. విదేశీ ఇన్వెస్టర్లు జోరు పెంచడమే దీనికి కారణం.కొవిడ్ థర్డ్ వేవ్ తర్వాత ఎకానమీ పుంజుకుంటుండటంతో ఈ పెట్టుబడులు జోరందుకున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ కాలియర్స్ ఇండియా ఒక రిపోర్టులో తెలిపింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రియల్ ఎస్టేట్‌లో సంస్థాగత పెట్టుబడులు 0.5 బిలియన్ డాలర్లని, ఇంతకు ముందు క్వార్టర్లో బిలియన్ డాలర్లని కూడా పేర్కొంది. కొవిడ్–19 ఎఫెక్ట్ తగ్గడంతో, ఎకానమీ జోరందుకుందని, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కూడా బలపడిందని వివరించింది. దీంతో అంతకు ముందు క్వార్టర్‌తో పోలిస్తే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు బాగా ఊపందుకున్నాయని తెలిపింది.
70 శాతం విదేశీ పెట్టుబడులే....
ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఆఫీస్ సెక్టార్లో భారీ డీల్స్ జరిగాయని కాలియర్స్ వెల్లడించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడులు మునుపెన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయని పేర్కొంది. తాజా క్వార్టర్లో మొత్తం పెట్టుబడులలో 70 శాతం విదేశీ ఇన్వెస్టర్లవేనని కాలియర్స్ రిపోర్టు తెలిపింది. 2020లో భారీగా పడిపోయిన దేశీయ పెట్టుబడులు సైతం ఈ ఏడాది మళ్లీ 30 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. అంటే, కరోనా ముందు లెవెల్‌కి చేరినట్లేనని వివరించింది. దేశీయ ఇన్వెస్టర్లలోనూ సెంటిమెంట్ బలపడిందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని అభిప్రాయపడింది.
ఆఫీసు, రిటెయిల్, లాజిస్టిక్సే ఎక్కువ.....
జనవరి–మార్చి క్వార్టర్లో 95 శాతం పెట్టుబడులు రియల్ ఎస్టేట్‌లోని ఆఫీసు, రిటెయిల్, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ సెగ్మెంట్లలోనే జరిగాయని కాలియర్స్ ఇండియా వెల్లడించింది. 23 శాతం పెట్టుబడులతో రిటెయిల్ సెక్టార్ రెండో ప్లేస్‌లో నిలిచిందని పేర్కొంది. ఈ సెగ్మెంట్లో ఒక పెద్ద డీల్ జరిగినట్లు తెలిపింది. మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 16 శాతం ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ సెక్టార్‌లోకి వచ్చాయని, వాటి విలువ 0.2 బిలియన్ డాలర్లని కాలియర్స్ ఇండియా వివరించింది. 2022 క్యూ1లోనూ డేటా సెంటర్లలోనూ పెట్టుబడులు పెరిగాయని పేర్కొంది. డేటా సెంటర్సెగ్మెంట్లో 40 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయని వివరించింది. గ్లోబల్ డేటా సెంటర్ రీట్స్, డేటా సెంటర్ మేనేజ్మెంట్ కంపెనీలు, హైపర్ స్కేలర్లు కూడా మన దేశంలో పెట్టుబడులు పెట్టడమే దీనికి కారణమని కాలియర్స్ ఇండియా పేర్కొంది.
రెసిడెన్షియల్లో అంతంత మాత్రమే...
జనవరి–మార్చి 2022 మధ్య కాలంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్లో పెట్టుబడులు పెద్దగా పెరగలేదని కాలియర్స్ ఇండియా రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో ఈ రంగంలో పెట్టుబడులు కేవలం 15 మిలియన్ డాలర్లేనని తెలిపింది. మొత్తం పెట్టుబడులలో ఇది ఒక శాతం మాత్రమేనని వివరించింది. రాబోయే క్వార్టర్లలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల జోరు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కాలియర్స్ ఇండియా తెలిపింది. దేశీయ ఇన్వెస్టర్లు బుల్లిష్‌గా ఉండటంతోపాటు, ఫండ్స్ సమీకరిస్తుండటంతో ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంది.
