ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కిమత్‌కు బిజినెస్ చేయాలని ఉన్నా.. ఆయన పేదరికం అందుకు అడ్డొచ్చింది. కుటుంబానికి చేదోడుగా ఉండడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అయ్యాడు. కానీ.. బిజినెస్ చేయాలనే పట్టుదల మాత్రం ఆయనలో ఏమాత్రం తగ్గలేదు. అందుకే చివరికి దూరపు బంధువు సాయంతో బిజినెస్ పెట్టాడు. కేవలం 10 వేల రూపాయలతో వ్యాపారం మొదలుపెట్టాడు. సీన్ కట్ చేస్తే.. వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు.
కిమత్ రాయ్ గుప్త.. పంజాబ్‌లోని మలేర్‌కోట్లలో అనే ఊరిలో 1937లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. వాళ్ల నాన్న కిరోసిన్ అమ్మే షాపు నడిపేవాడు. చిన్నప్పటినుంచి కిమత్ కూడా ఆ షాపులోనే పనిచేసేవాడు. కిరోసిన్ కొనడానికి వచ్చేవాళ్లను వరుసలు పెట్టి పిలుస్తూ.. పరిచయం పెంచుకునేవాడు. దాంతో బిజినెస్ బాగానే పెరిగింది. అందుకే కిమత్‌కు వ్యాపారం మీద ఇంట్రెస్ట్ కలిగింది. కానీ.. అందుకు కావాల్సిన డబ్బు లేదు. దాంతో ఒక స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టాడు. కొన్నాళ్లు ఉద్యోగం చేసిన తర్వాత అనుకోకుండా తన టాలెంట్‌ని నిరూపించుకునే అవకాశం దక్కింది. ఢిల్లీలో ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మే తన బంధువు పీసీ గుప్తా నుంచి ఒక లెటర్ వచ్చింది. అందులో.. ఆయన బిజినెస్ పని మీద కొన్ని రోజులు షాపు వదిలి వెళ్తున్నట్టు తిరిగి వచ్చేవరకు బిజినెస్‌ని చూసుకోవడానికి కిమత్‌ని ఢిల్లీ రావాలని రాశాడు. ఆ లెటర్ చదివిన తర్వాత కిమత్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కొన్ని రోజులైనా తనకు నచ్చిన పని చేయొచ్చు అనుకున్నాడు. దాంతో పంజాబ్ నుంచి ఢిల్లీకి బయల్దేరాడు.
కిమత్ తలరాత మారింది
కిమత్ 1958లో ఢిల్లీలో అడుగు పెట్టినప్పటినుంచి అతని తలరాత పూర్తిగా మారిపోయింది. కొన్ని రోజుల్లోనే పీఎస్ గుప్తా షాపులో సేల్స్ పెంచాడు. పీఎస్ గుప్తా తిరిగొచ్చాక అది చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత తక్కువ టైంలో అంతలా డెవలప్ చేసిన కిమత్‌తో కలిసి బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇద్దరూ కలిసి ఢిల్లీలోని ఎలక్ట్రికల్ హోల్‌సేల్ మార్కెట్ భగీరథ్ ప్లేస్‌లో 10,000 రూపాయల పెట్టుబడితో గుప్తాజీ అండ్ కంపెనీ పేరుతో ఎలక్ట్రికల్ ట్రేడింగ్ కంపెనీని పెట్టారు. కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ వస్తువులను కొని, రిటైల్ షాపులకు అమ్మేవాడు. అంటే డిస్ట్రిబ్యూటర్‌లా పనిచేసేవాళ్లు. ముఖ్యంగా కేబుల్స్, లైట్లు, ఫ్యాన్లను అమ్మేవాళ్లు. అయితే.. కిమత్ ఎక్కువగా రిస్క్ తీసుకుని వ్యాపారం చేసేవాడు. పీసీ గుప్తా మాత్రం సేఫ్ జోన్‌లో ఉండాలనుకునే వ్యక్తి. అందుకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో కిమత్.. పీసీ గుప్తాకు 40,000 రూపాయలు ఇచ్చి బిజినెస్ మొత్తాన్ని కొనేశాడు. కానీ.. ఇలా డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటే వచ్చే లాభాల కంటే సొంతంగా కంపెనీ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి అనుకున్నాడు కిమత్. కానీ.. అందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో ఆ ఆలోచనను వదులుకున్నాడు.
హవెల్స్ ఎలా మొదలైంది
హవెల్స్ కంపెనీని హవేలీ రామ్ గాంధీ స్థాపించాడు. కిమత్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసిన కంపెనీల్లో ఇది కూడా ఒకటి. అయితే.. బాగా నష్టాలు రావడం వల్ల హవేలీ రామ్ గాంధీ కంపెనీని అమ్మాలి అనుకున్నాడు. అప్పటికే డిస్ట్రిబ్యూటర్‌గా బాగా డబ్బు సంపాదించాడు కిమత్. పైగా సొంతంగా కంపెనీ పెట్టాలనే ఆలోచన కూడా ఉంది. దాంతో 1971లో హవేలీ రామ్ గాంధీ నుండి కిమత్ గుప్తా హవేల్స్ బ్రాండ్ నేమ్‌ని 7 లక్షల రూపాయలు ఇచ్చి కొన్నాడు. కానీ.. కంపెనీని మాత్రం కొనలేదు. ఎందుకంటే.. కంపెనీ కొనేంత డబ్బు ఆయన దగ్గర లేదు. పైగా డబ్బులు ఉంటే కంపెనీ ఎలాగైనా పెట్టొచ్చు. దాని పేరుని జనాల్లోకి తీసుకెళ్లడానికి చాలా టైం పడుతుంది. పైగా మార్కెటింగ్ కోసం చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే ఎస్టాబ్లిష్‌డ్ కంపెనీ పేరుని కొంటే అవన్నీ కలిసి వస్తాయి అనుకున్నాడు. అందుకే హవెల్స్ అనే పేరుని మాత్రమే కొన్నాడు. దాన్ని కొన్నప్పటినుంచి కిమత్ రాయ్ గుప్తా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మొదట్లో వేరే కంపెనీల ప్లాంట్లలో తన వస్తువులను తయారుచేయించి వాటికి హవేల్స్ లేబుల్ వేసి మార్కెట్‌లో అమ్మేవాడు. అలా కొన్ని రోజుల్లోనే మంచి లాభాలు సంపాదించాడు. అలా వచ్చిన డబ్బుతో ఒక ప్రొడక్షన్ ప్లాంట్ పెట్టి దాన్ని డెవలప్ చేయడానికి స్కెచ్ వేశాడు. కంపెనీని సక్సెస్ చేయడానికి కొత్త ప్లాన్లు వేశాడు. అందులో భాగంగానే రీవైరబుల్, ఛేంజ్‌ఓవర్ స్విచ్‌లకు భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని గమనించి 1976లో సొంతంగా వాటి తయారీ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీగా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే వాటికి డిమాండ్ పెరిగింది. కంపెనీ లాభాల పట్టాలు ఎక్కింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ని డెవలప్ చేశాడు. ఆ సక్సెస్‌తో కంపెనీ 1979లో హెచ్‌బీసీ ఫ్యూజ్‌ల తయారీ కోసం ఢిల్లీలోని బద్లీలో మరో రెండు ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. తిలక్ నగర్ ప్రాంతంలో హై క్వాలిటీ ఎనర్జీ మీటర్ల తయారీ కోసం 1980లో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. హవేల్స్ సేల్స్ సైజ్ ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది.
చైనా ఎఫెక్ట్
1980ల చివరలో ఇండియన్ మార్కెట్‌లోకి చైనీస్ ప్రొడక్ట్స్ విపరీతంగా వచ్చేశాయి. దాంతో ఇండియాలోని ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది. దేశీయ తయారీ కంపెనీలు చౌకైన చైనీస్ ప్రొడక్ట్స్ ఇచ్చే కాంపిటీషన్‌ను తట్టుకోలేకపోయాయి. చాలా ఇండియన్ కంపెనీలు తమ ప్రొడక్షన్ యూనిట్లను మూసివేశాయి. కిమత్ రాయ్ స్ట్రాటజీల వల్ల అలాంటి పరిస్థితులను కూడా హవెల్స్ తట్టుకుంది. దానికి కారణం.. కస్టమర్‌కు ఎలాంటి ప్రొడక్ట్ అవసరమే తెలుసుకుని అలాంటివి మాత్రమే ప్రొడ్యూస్ చేసేవాళ్లు. కాంపిటేటర్ కంపెనీలతో పోలిస్తే.. ధర కూడా చాలా తక్కువగా ఉండేది.
దేశం నుంచి విదేశాలకు
కంపెనీ పెట్టినప్పుడు ఎలాంటి ఎత్తులు వేశాడో, దాన్ని విదేశాలకు ఎక్స్‌పాండ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా అలాంటి ఎత్తులే వేసి సక్సెస్ అయ్యాడు కిమత్ రాయ్ గుప్తా. వ్యాపారాన్ని ఎక్స్‌పాండ్ చేయడానికి కొత్త యూనిట్లు పెట్టడం కంటే అప్పటికే ఉన్న ప్లాంట్లను కొనాలి అనుకున్నాడు. అందుకే నష్టాల్లో ఉన్న కంపెనీలను కొని, డెవలప్ చేశాడు. జర్మనీకి చెందిన ఒక కంపెనీతో జాయింట్ వెంచర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కంపెనీ 1998 నుండి 2002 మధ్యకాలంలో క్రాబ్ ట్రీ, స్టాండర్డ్, డ్యూక్ ఆర్నిక్స్ ఎలక్ట్రానిక్స్ లాంటి బ్రాండ్‌లను కొనుగోలు చేసింది. అంతేకాదు.. కేవలం విదేశాలకు వ్యాపారాలను విస్తరించాలనే ఉద్దేశంతో అప్పటికే 50కి పైగా దేశాల్లో బిజినెస్ నడుపుతున్న సిల్వేనియా అనే యూరప్‌కి చెందిన కంపెనీని 2007లో కొన్నారు. ఇది హెవెల్స్ కన్నా చాలా పెద్ద కంపెనీ. అయినా.. కిమత్ దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఖర్చు చేసి కొన్నారు. 2013 నాటికి కంపెనీ లాభాల బాట పట్టింది. 2014 నవంబర్ 7న కిమత్ రాయ్ గుప్తా గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత ఆయన రెండో కొడుకు అనిల్ రాయ్ గుప్తా కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన కూడా కంపెనీని బాగా డెవలప్ చేసి, చాలా దేశాల్లో హవెల్స్ బిజినెస్‌ని విస్తరించాడు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఈ మధ్య సిల్వేనియా కంపెనీలోని 80 శాతం వాటాను అమ్మేశారు.
లాభాల్లో...
పది వేల రూపాయలతో బిజినెస్ మొదలుపెట్టిన కిమత్ దాన్ని వేల కోట్ల బిజినెస్‌గా మార్చారు. చిన్న చిన్న ఎలక్ట్రికల్ పరికరాలు తయారు చేసే హవెల్స్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు భారీ అప్లియెన్స్‌ని కూడా తయారు చేస్తోంది. ప్రస్తుతం హవెల్స్ నుంచి ఇండస్ట్రియల్, డొమెస్టిక్ సర్క్యూట్ ప్రొటెక్షన్ స్విచ్ గేర్, కేబుల్స్, వైర్లు, మోటార్లు, ఫ్యాన్లు, పవర్ కెపాసిటర్లు, ల్యాంప్స్, డొమెస్టిక్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం ల్యాంప్స్, మాడ్యులర్ స్విచ్‌లు, వాటర్ హీటర్లు, హోమ్ అప్లియెన్స్‌స్ తయారు చేస్తోంది. మన దేశంలో హరిద్వార్, బడ్డీ, సాహిబాబాద్, ఫరీదాబాద్, అల్వార్, నీమ్రానా, ఘిలోత్‌లలో 14 అత్యాధునిక ప్రొడక్షన్ ప్లాంట్లు ఉన్నాయి. ప్రస్తుతం హవెల్స్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రాండ్‌గా ఎదిగింది. హవెల్స్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ స్టోర్స్‌తోపాటు చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 5,300 కంటే ఎక్కువ మంది కంపెనీకి డిస్ట్రిబ్యూటర్లుగా పనిచేస్తున్నారు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని పరికరాలను తయారుచేస్తోంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఐ బేస్డ్ పరికరాలు కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
సి.ఎఫ్.ఎల్.
కంపెనీ తయారు చేసే సీఎఫ్‌ఎల్ బల్బ్‌లు, ఫ్యాన్లు, లైటింగ్ ప్రొడక్ట్స్ నుంచి పెద్ద పెద్ద అప్లియెన్సెస్ వరకు అన్నింటిలో క్వాలిటీ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇన్నొవేషన్స్‌లోనూ కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. పిల్ డోసింగ్ టెక్నాలజీని ఉపయోగించి ‘గ్రీన్ సీఎఫ్‌ఎల్’ను తయారు చేసిన మొట్టమొదటి ఇండియన్ కంపెనీగా హవెల్స్ రికార్డుకెక్కింది. అంతేకాదు.. బీఈఈ ఫైవ్-స్టార్ రేటెడ్ ఫ్యాన్‌ను కూడా ఈ కంపెనీ తీసుకొచ్చింది.