మహబూబ్​నగర్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూం ఇండ్లపై ఎంక్వైరీ షురూ

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: డబుల్  బెడ్రూం ఇండ్ల కేటాయింపు అక్రమాలపై మహబూబ్​నగర్  మున్సిపాలిటీ పరిధిలోని దివిటిపల్లిలో అధికారులు బుధవారం ఇంటింటికీ తిరిగి ఎంక్వైరీ చేపట్టారు. అడిషనల్​ కలెక్టర్  మోహన్ రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్  ఎంక్వైరీని  పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అడిషనల్  కలెక్టర్  మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు కేటాయించిన డబుల్  బెడ్రూం ఇండ్లను వారసత్వంగా అనుభవించవచ్చని, ఇతరులకు  అమ్మినా, కొన్నా చట్ట ప్రకారం తప్పు చేసినట్లేనన్నారు. ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులు, సంపన్నవర్గాలు డబుల్  బెడ్రూం ఇండ్లు పొంది ఉంటే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని సూచించారు. లేదంటే చర్యలు తప్పవన్నారు.

బాధితురాలికి న్యాయం..

గత ప్రభుత్వ హయాంలో దివిటిపల్లిలో షహీదా బేగంకు డబుల్  బెడ్రూం కేటాయించారు. ఆమె కొడుకు మానసిక దివ్యాంగుడు కావడంతో చికిత్స కోసం హైద్రాబాద్  ఆసుపత్రికి వెళ్తుండేది. ఆ సమయంలో ఆమెకు కేటాయించిన ఇంటి తాళం పగులగొట్టి ఇతరులు నకిలీ కేటాయింపు పత్రంతో కబ్జా చేశారు. బాధితురాలు వెళ్తే బెదిరించి పోలీస్  కేసు పెట్టారు. దీంతో న్యాయం చేయాలని షహీదాబేగం తహసీల్దార్, ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. తహసీల్దార్  ఆఫీస్, ఆన్ లైన్ లోనూ ఆ ఇల్లు షహిదాబేగం పేరుపై ఉండడంతో బుధవారం బాధితురాలికి డబుల్  బెడ్రూం ఇంటి పట్టాను అడిషనల్​ కలెక్టర్  అందజేశారు.