విద్యుత్ శాఖలోని బీసీ ఉద్యోగులకు అన్యాయం

  • ప్రమోషన్లు లేకుండానే రిటైర్ అవుతున్నారు
  • ప్రభుత్వం స్పందించి ప్రమోషన్లు కల్పించాలి
  • రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ శాఖలోని బీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బీసీ ఉద్యోగులు హయ్యర్ ​పొజిషన్​కు వెళ్లకుండానే రిటైర్​అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 8న ఖైరతాబాద్ లో తలపెట్టిన విద్యుత్  బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభల పోస్టర్ ను గురువారం కాచిగూడలో ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమోషన్లలో జరిగిన అవకతవకలను సరిచేయాలని, నష్టపోయిన బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో క్రిమిలేయర్ ను ఎత్తివేసి, రిజర్వేషన్లు కల్పించాలన్నారు. విద్యుత్ శాఖలోని డైరెక్టర్లలో ఒక్క బీసీ కూడా లేరన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 24 డైరెక్టర్ పోస్టుల్లో 12 పోస్టులను అర్హత కలిగిన బీసీలకు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య కోరారు. విద్యుత్​సంస్థల్లో 24 వేల మంది ఉద్యోగులు ఆర్టిజన్లుగా కొనసాగుతున్నారని.. అర్హతను బట్టి రెగ్యులర్ చేయాలన్నారు. 

ఈ సమావేశంలో తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి.బ్రహ్మేంద్రరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ప్రేమ కుమార్, ఎం.అశోక్ కుమార్, డాక్టర్ చంద్రుడు, రామలింగం  పాల్గొన్నారు.