ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాను భూకంపం వణికించింది. శుక్రవారం సంభవించిన భూకంపంలో ఏడుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 85 మంది గాయపడ్డారు. ఇండోనేషియా పశ్చిమ సుమత్రా దీవుల్లోని పసమాన్ బరత్, పసమాన్ జిల్లాల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూకంప తీవ్రతకు దాదాపు పదివేలకు పైగా ఇండ్లు, బిల్డింగులు ధ్వంసమైనట్లు అక్కడి అధికారులు చెప్పారు.

మలేసియా, సింగపూర్‌లో భూ ప్రకంపనలు ప్రజల్ని భయపెట్టాయి. పశ్చిమ సుమ త్రా ప్రావిన్స్‌లోని బుకిటింగి పట్టణం భూకంప కేంద్రంగా ఉంది. భూ ఉపరితలానికి 12 కిలోమీటర్ల దిగువన భూమి కంపించినట్టుగా అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.  బాధితుల్ని ఆదుకునేందుకు ఇంకా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కనిపించకుండా పోయిన ప్రజల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఐదు వేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, 35 ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేశారు.