కుటుంబాలెన్నోఅప్లికేషన్లు అన్ని..!..జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే

  • జనగామ జిల్లాలో 1,62,512 కుటుంబాలకు 1,43,187 అప్లికేషన్లు..
  • అర్హుల వడపోతలో అధికార యంత్రాంగం
  • ఈనెల 31 వరకు సర్వేకు డెడ్ లైన్​

జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్పీడందుకుంది. ఈనెల 31 వరకు డెడ్​లైన్​ ఉండగా అర్హుల ఎంపికకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కుటుంబాలు ఎన్ని ఉంటే అప్లికేషన్లు కూడా ఇంచుమించు అంతే ఉండడంతో వడపోత పనిలో ఉన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు కానున్న నేపథ్యంలో తొలివిడతలో నిరుపేదలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు జిల్లాలో 464 మంది సిబ్బందితో సర్వేలో నిర్వహిస్తున్నారు. 

1,43,187 అప్లికేషన్లు..

జిల్లాలో 1,62,512 కుటుంబాలున్నాయి. వీటిలో రూరల్​ పరిధిలో 1,46,428 కుటుంబాలు కాగా, జనగామ పట్టణంలో 16,084 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రజాపాలనలో 1,43,187 మంది ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని అప్లై చేసుకున్నారు. దీంతో 20 వేల కుటుంబాలు మినహా మిగతా వారంతా ఇండ్లు కావాలని అప్లై చేసినట్లైంది. జిల్లాలో 12 మండలాలు ఉండగా జనగామ మున్సిపల్​పరిధిలో 9,814 మంది, రూరల్​ పరిధిలో 10,946 మంది ఇండ్ల కోసం అప్లై చేశారు.

బచ్చన్నపేట మండలంలో 11,305, చిల్పూరు 11,244, దేవరుప్పుల 10,906, స్టేషన్​ఘన్​పూర్ 14,510, కొడకండ్ల 8,818, లింగాల ఘన్​పూర్ 10,853, నర్మెట 6398, పాలకుర్తి 16,598, రఘునాథపల్లి 14,396, తరిగొప్పుల 4982, జఫర్​ఘడ్ మండలంలో 12,417 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో అర్హుల గుర్తింపు చేపడుతున్నారు. కలెక్టర్​రిజ్వాన్​ బాషా షేక్​తోపాటు అడిషనల్​ కలెక్టర్లు రోహిత్​ సింగ్, పింకేశ్​ కుమార్ నిత్యం సర్వేపై స్పెషల్​ ఫోకస్​ పెడుతున్నారు. ఫీల్డ్​ లెవల్​లో పర్యటిస్తూ స్టాఫ్​ను అప్రమత్తం చేస్తున్నారు.  

ఈనెలాఖరు డెడ్​లైన్..​

ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు ఈనెల 31 వరకు డెడ్​లైన్​ఉండగా, ఇప్పటివరకు 37,430 అప్లికేషన్ల వెరిఫికేషన్​పూర్తైంది. మిగతావి కూడా ఇన్​టైంలో కంప్లీట్​చేసేలా ముందుకు సాగుతున్నారు. జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు, జనగామ టౌన్​లో 30 వార్డులు ఉండగా, 464 మంది సిబ్బందితో సర్వే జరుగుతోంది. పంచాయతీ కార్యదర్శులు, జూనియర్​అసిస్టెంట్​స్థాయి ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొంటుండగా, ప్రతి 500  కుటుంబాలకు ఒకరిని నియమించారు. వీరు అప్లికేషన్​ దారులు ఉంటున్న నివాసం వద్దకు వెళ్లి వివరాలు అప్​లోడ్​ చేస్తున్నారు.

లాగిన్ అవగానే ప్రజాపాలనకు సంబంధించిన వివరాలు కనిపిస్తుండగా, దాని ఆధారంగా సొంతిల్లా, అద్దె ఇల్లా, కుటుంబంలో ఎంతమంది ఉన్నరు. ఇంటి స్థలం ఉందా అనే తదితర వివరాలను పక్కాగా నమోదు చేస్తున్నారు. ఇంటి స్థలం ఉంటే డాక్యుమెంట్​తోపాటు దరఖాస్తుదారుడిని నిల్చోబెట్టి ఫొటో తీసి అప్​లోడ్​చేస్తున్నారు. సర్వే చేసిన చోట, ఇంటిస్థలం ఉన్న చోట రెండింటి వద్ద జియో ట్యాగింగ్​చేస్తున్నారు. ఇల్లు మంజూరైతే సదరు జియో ట్యాగింగ్​అయిన చోట మాత్రమే ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పక్కాగా సర్వే..

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పక్కాగా నిర్వహిస్తున్నాం. అప్లికేషన్లు ఎక్కువగా ఉండడంతో అర్హుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నం. జిల్లాలో 1,43,187 అప్లికేషన్లు ఉండగా, 464 మంది సిబ్బందితో సర్వే వేగంగా చేపడుతున్నం. ఈనెలాఖరు వరకు సర్వే పూర్తి కానుంది. 

- దామోదర్​రావు, ఈఈ, గృహ నిర్మాణ శాఖ, జనగామ