తెలంగాణ అభిమానానికి ఇందిరాగాంధీ ఫిదా

భారత తొలి, ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ. రాజకీయాల్లో ఆమెను ‘గూంగీ గుడియా’(మూగ బొమ్మ)గా పిలిచిన నేతలే.. ఆమె పాలనా దక్షతను  మెచ్చుకుని ‘ఐరన్ లేడీ’(ఉక్కు మహిళ)గానూ శ్లాఘించారు.  నాలుగుసార్లు ఇందిర ప్రధాని పదవిని చేపట్టారు. పేదరిక నిర్మూలనకు సామాజిక సంక్షేమ పథకాలకు ఆమె పేరే స్థిరపడిపోయింది. వ్యవసాయంలో హరిత విప్లవం  వంటి విప్లవా త్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తన పాలనతో దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. అయితే, 1975 ఎమర్జెన్సీ అపవాదుతో 1977 ఎన్నికల్లో ఇందిర ప్రధాని పదవితోపాటు కాంగ్రె స్ అధికారం కోల్పోయింది. సొంతగడ్డ రాయ్ బరేలీలోనూ ఓడిపోయారు. రాజకీయంగా విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇందిర రాజకీయ ప్రస్థానం ఇక ముగిసినట్టేనని విపక్ష నేతలు హేళన చేశారు. అదే ఏడాది జనతా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా పూర్తికాలం నిలబడలేదు. 1980లో  మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ విజయ భేరి మోగిం చింది. ఇందిర పడిలేచిన కెరటంలా నాలుగోసారి ప్రధాని పీఠమెక్కారు. ఆమె సక్సెస్ చూసి గతంలో విమర్శించిన నేతలే విస్తుపోయారు. 

మెదక్ నుంచి గెలిచి ప్రధాని పీఠమెక్కారు 

1980 ఎన్నికల్లో  ఇందిర సొంతగడ్డ రాయ్ బరేలీతోపాటు మెదక్ నుంచి పోటీ చేశారు. మెదక్​లో 2 లక్షలకుపైగా భారీ మెజార్టీతో  గెలిచారు.  ఆ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 15 ఎంపీ స్థానాలు గెలిచింది. ఈ పరిణామంతో ఇందిర ఆశ్చర్య పోయారు.  తెలంగాణ  ప్రజల అభిమానానికి ఫిదా అయ్యారు. అనంతరం మెదక్ లో భారీ విజయోత్సవ  ర్యాలీ తీశారు. రాయ్​ బరేలీ సీటుకు రాజీనామా చేసి, మెదక్ ఎంపీగానే కొనసాగారు. మెదక్ ప్రజలపైనే  అభిమానం చూపుతూ..  ఎక్కువగా పర్యటిస్తూ  ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. ఇందిర గెలుపుతో మెదక్..దేశచరిత్రలోనే  గుర్తింపు దక్కించుకుంది. 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు  

మెతుకుసీమతోపాటు హైదరాబాద్​లోనూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), దేశరక్షణ రంగానికి అత్యంత కీలకమైన సంగారెడ్డిలోని ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ (ఓడీఎఫ్‌‌‌‌‌‌‌‌)ని తన హయాంలోనే ఏర్పాటు చేశారు.  జహీరాబాద్​లో ఆల్విన్ కంపెనీ, అందో లులో సంజయ్ గాంధీ గ్రామీణ విద్యుద్ధీకరణ స్కీమ్, రుద్రారంలో రక్షిత మంచినీటి  స్కీమ్ వంటి అభివృద్ధి పథకాలు అమలు చేశారు. ప్రధాని హోదాలో ఇందిర సంగారెడ్డి జడ్పీ మీటింగ్​కు హాజరై పార్టీ నేతలను ఆశ్చర్యపరిచారు.  ఇప్పటికీ తెలంగాణలో ఏ ఊరికెళ్లినా ఇందిర పాలనలో  నిర్మించిన ఇండ్లు కనిపిస్తాయి. పల్లెల్లోని ప్రజలు ఆమె పాలనను గుర్తు చేసుకుని కొనియాడుతారు.  

సేవలను పొగిడేందుకు సాహసించరు

ఇందిరను ఆమె పాలన కంటే.. రాజకీయంగానే విపక్ష నేతలు ఎక్కువగా విమర్శలకు దిగుతుంటారు. ఒక్క ఎమర్జెన్సీనే ఎత్తిచూపుతూ.. ఆమెను అప్రతిష్ట పాలు చేస్తుంటారు. ఆమె పాలనా సేవలను పొగిడేందుకు సాహసించరు. రాజకీయ విమర్శలను వదిలేస్తే.. ఆమె తన పాలనలో తెలంగాణపై మాత్రం చెదరని ముద్రనైతే వేశారు. 1984లో హత్యకు గురయ్యే వరకు మెదక్ ఎంపీగా,  ప్రధానిగా ఈ ప్రాంత ఖ్యాతిని దేశవ్యాప్తంగా పెంపొందించేందుకు కృషి చేశారు. ఇందిర రాజకీయంగా.. పాలనాపరంగా ధీశాలిగానూ పేరుపొందారు. దేశానికి ఆమె చేసిన సేవలు నాటితరం నేతలకే కాదు.. నేటితరం నాయకులకూ  స్ఫూర్తిదాయకం.

- వేల్పుల సురేష్, 
సీనియర్ జర్నలిస్టు