న్యూఢిల్లీ :చిలికి చిలికి గాలివానగా మారిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ల మధ్య వివాదం ఒక కొలిక్కి వస్తోంది. రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియాలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను ఇండిగో ఛైర్మన్ ఎం. దామోదరన్ నెత్తికెత్తుకున్నారు. డైరెక్టర్ల బోర్డు పునర్ వ్యవస్థీకరణలో రాకేష్ గంగ్వాల్‌కూ సముచిత పాత్ర ఇవ్వాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇండిగో బోర్డులో డైరెక్టర్ల సంఖ్యను పదికి పెంచాలని ఇప్పటికే ప్రతిపాదించారు. ఇందులో రాహుల్ భాటియాకు చెందిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజ్ అయిదుగురు డైరెక్టర్లను నామినేట్ చేస్తుందని, రాకేష్ గంగ్వాల్ తాను డైరెక్టర్‌గా ఉండటంతోపాటు 4 ఇండిపెండెంట్ డైరెక్టర్లలో ఒకరిని నామినేట్ చేసుకోవచ్చనే అంగీకారం కుదిరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇండిగో బోర్డులో ఇప్పటిదాకా ఆరుగురు డైరెక్టర్లే ఉన్నారు. బోర్డులో డైరెక్టర్ల సంఖ్యను పెంచాలని కూడా ఇటీవలే నిర్ణయించారు. ఒక మహిళను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయించారు.
ఇద్దరి మధ్యా చర్చలు ఇంకా జరుగుతున్నాయని గంగ్వాల్ ధృవీకరించారు. ఐతే, ఇలాంటి చొరవ ఇంతకు ముందే జరిగి ఉండాల్సిందని గంగ్వాల్ సన్నిహితులు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ (ఆర్‌పీటీ) విషయంలో నిబంధనలను మార్పు చేస్తున్నట్లు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ బుధవారం స్టాక్ ఎక్స్చేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. రాకేష్ గంగ్వాల్ ఆరోపణలలో ప్రధానమైనది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించినదే కావడం గమనార్హం. వివాదం మొదలైనప్పటి నుంచి ఒకరి మీద మరొకరు రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియాలు తీవ్రంగా ఆరోపణలు గుప్పించుకున్న విషయం తెలిసిందే. ఏదేమైనప్పటికీ, ఇద్దరి నడుమ వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లేనని, ఇండిగో అభివృద్ధి వ్యూహానికి ఇద్దరూ కట్టుబడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఇండిగో షేర్లు కోలుకున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో 6 శాతానికి పైగా పెరిగాయి.ఇంట్రాడే ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 6.2 శాతం లాభపడి రూ.1,618 వద్ద ట్రేడయ్యాయి. చివరికి ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు 5.95 శాతం లాభంతో రూ.1,614.05 వద్ద ముగిశాయి. బీఎస్‌ఈలో 4.69 శాతం లాభపడి రూ.1,594.45 వద్ద క్లోజయ్యాయి.
