మనదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో పేరెంట్ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ప్రమోటర్లు రాకేశ్ గంగ్వాల్, రాహుల్ భాటియాల మధ్య జరుగుతున్న గొడవ సద్దుమణిగింది. రాజీకి రావడానికి ఇరు వర్గాలూ అంగీకరించాయి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ (ఆర్పీటీలు) విధానంలో మార్పులు చేయడానికి ఒప్పుకున్నాయి. బోర్డు డైరెక్టర్ల సంఖ్యను 10కి పెంచాలన్న ప్రతిపాదనకు ఏజీఎంలో ఆమోదముద్ర వేశాయి. డైరెక్టర్ల సంఖ్యను పెంచడానికి ఏజీఎంలో చేసే ప్రతిపాదనను తాను వ్యతిరేకిస్తానని గంగ్వాల్ ఇది వరకే ప్రకటించారు. అయితే కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అపోసియేషన్ (ఏఓఏ)ను మార్చడానికి అనుకూలంగా ఓటేశారు.
‘‘ఇండిపెండెంట్ డైరెక్టర్లు/డైరెక్టర్లు కంపెనీని వీడినప్పుడు అనుసరించాల్సిన విధానంలో మార్పులు వచ్చాయి. ఇక నుంచి ఎవరైనా ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజీనామా చేసినా, మరణించినా కొత్త విధానం ప్రకారం బోర్డు సైజు తొమ్మిదికి తగ్గుతుంది. రాహుల్ భాటియాకు చెందిన ఐజీఈ తరఫున నుంచి ఐదుగురు ఎంపికవుతారు. నలుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉంటారు. గంగ్వాల్ తరఫున ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు’’ సంబంధిత ఆఫీసర్ ఒకరు వివరించారు.
భాటియా కంపెనీ కార్పొరేట్ పాలన రూల్స్‌ను ఉల్లంఘించారని గతంలో గంగ్వాల్ ఆరోపించారు. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్‌ను ప్రశ్నించారు. బోర్డులో మరింత మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉండాలని కోరారు. పాలనలో లోపాలపై విచారణ జరిపించాలని కోరుతూ సెబీకి గత నెల లేఖ రాశారు. ఆర్పీటీలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. భాటియా మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ తిరస్కరించారు.
