- 2026 నాటికి ప్రింట్ మీడియా రెవెన్యూ రూ.30 వేల కోట్లకు..
- భారీగా పెరగనున్న టీవీ యాడ్ మార్కెట్ రెవెన్యూ
- దేశ మీడియా&ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్ సైజు 5 ఏళ్లలో
- రూ. 4.3 లక్షల కోట్లకు వెల్లడించిన పీడబ్ల్యూసీ రిపోర్ట్
న్యూఢిల్లీ: డిజిటల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో న్యూస్ పేపర్ ఇండస్ట్రీ కూడా నిలకడగా ఎదుగుతుందని ప్రైస్ వాటర్ హౌస్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) రిపోర్ట్ వెల్లడించింది. అంతేకాకుండా దేశ న్యూస్ పేపర్ మార్కెట్ 2026 నాటికి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్‌గా ఎదుగుతుందని వివరించింది. ఇండియా మీడియా&ఎంటర్‌టైన్‌మెంట్ (ఎం &ఈ) ఇండస్ట్రీ రెవెన్యూ రానున్న ఐదేళ్లలో రూ. 4,30,401కోట్లకు చేరుకుంటుందని అంచనావేసింది. ఈ సెక్టార్‌కు సంబంధించిన వివరాలను పీడబ్ల్యూసీ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ & మీడియా అవుట్‌లుక్ 2022–26 బయటపెట్టింది. దేశంలోని 52 ఏరియాలలోని కన్జూమర్లు, అడ్వర్టయిజర్ల నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్ట్‌ను తయారు చేశామని పీడబ్ల్యూసీ చెబుతోంది. కాగా, పీడబ్ల్యూసీకి ఇది 23 వ యాన్యువల్ అనాలసిస్. దేశ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ సెక్టార్‌లో న్యూస్‌పేపర్లు, టీవీ, రేడియో, మ్యూజిక్, ఇంటర్నెట్, వీడియోగేమ్స్, ఓటీటీ వంటి సబ్‌సెక్టార్లు ఉన్నాయి.
న్యూస్ పేపర్ల ప్రింటింగ్ పెరుగుతుంది..
ఈ రిపోర్ట్ ప్రకారం, రానున్న ఐదేళ్లలో కేవలం ఇండియాలో మాత్రమే న్యూస్ పేపర్ల రెవెన్యూ నిలకడగా పెరుగుతుంది. 2026 నాటికి దేశ న్యూస్ పేపర్ మార్కెట్ ఫ్రాన్స్, యూకేని దాటి ఐదో అతిపెద్ద మార్కెట్‌గా మారుతుంది. అంతేకాకుండా న్యూస్‌పేపర్ మార్కెట్ రెవెన్యూ ఏడాదికి 2.7 % పెరిగి 2026 నాటికి రూ. 29,945 కోట్లకు చేరుకుంటుంది. 2021 లో రూ. 26,378 కోట్ల రెవెన్యూని ఈ మార్కెట్ సాధించింది. కేవలం రెవెన్యూ మాత్రమే కాకుండా న్యూస్ పేపర్ల వాల్యూమ్స్ కూడా రానున్న ఐదేళ్లలో పెరుగుతాయని పీడబ్ల్యూసీ రిపోర్ట్ పేర్కొంది. 2026 నాటికి దేశంలో రోజుకి సగటున 13.9 కోట్ల డైలీ న్యూస్ పేపర్లు అమ్ముడవుతాయని అంచనావేసింది.
వీడియో గేమ్స్, మ్యూజిక్..
దేశంలో వీడియోగేమింగ్ సెగ్మెంట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. రానున్న ఐదేళ్లలో ఈ మార్కెట్ ఏడాదికి 20.6 % చొప్పున వృద్ధి సాధిస్తుందని, 2026 నాటికి ఈ మార్కెట్ రెవెన్యూ రూ. 34,581 కోట్లకు పెరుగుతుందని పీడబ్ల్యూసీ రిపోర్ట్ పేర్కొంది. 5జీ టెక్నాలజీ వీడియోగేమింగ్ సెక్టార్‌కు సపోర్ట్‌గా ఉంటుందని అభిప్రాయపడింది. దేశ మ్యూజిక్, రేడియో, పాడ్‌కాస్ట్ సెగ్మెంట్ రెవెన్యూ 2026 నాటికి రూ. 11,536 కోట్లకు పెరుగుతుందని వెల్లడించింది.
‘ఇంటర్నెట్’ కూడా పైకే..
దేశ టీవీ అడ్వర్టయిజింగ్ మార్కెట్ కూడా రానున్న ఐదేళ్లలో దూసుకుపోతుందని, ఈ మార్కెట్ రెవెన్యూ ఏడాదికి 6.3 % పెరిగి రూ. 43,410 కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ రిపోర్ట్ అంచనావేసింది. 2021 లో టీవీ అడ్వర్టయిజింగ్ రెవెన్యూ రూ. 32,374 కోట్లుగా ఉంది. 2026 నాటికి దేశ టీవీ యాడ్ మార్కెట్ ఐదో అతిపెద్ద మార్కెట్‌గా మారుతుందని, యూఎస్, జపాన్, చైనా, యూకేల సరసన చేరుతుందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. పీడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం, దేశ ఇంటర్నెట్ అడ్వర్టయిజింగ్ మార్కెట్ రెవెన్యూ కూడా రానున్న ఐదేళ్లలో ఏడాదికి 12.1% మేర పెరిగి 2026 నాటికి రూ. 28,234 కోట్లకు పెరుగుతుంది. అదే సినిమా మార్కెట్ రానున్న ఐదేళ్లలో ఏడాదికి 38.3 % గ్రోత్‌ను నమోదు చేస్తుందని, 2026 నాటికి ఈ మార్కెట్ రెవెన్యూ రూ. 16,198 కోట్లకు పెరుగుతుందని పీడబ్ల్యూసీ వెల్లడించింది. 2026 నాటికి ఓటీటీ మార్కెట్ రెవెన్యూ రూ. 21,032 కోట్లకు చేరుకుంటుందని అంచనావేసింది.
