- ఇండియా నుంచి 84 మంది అథ్లెట్లు బరిలోకి
- 19 పతకాల రికార్డును బ్రేక్ చేస్తారా?
- రా. 11.25 నుంచి ఓపెనింగ్ సెర్మనీ
పారిస్ : భారీ ఆశలతో పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన మన అథ్లెట్లు కనీసం ఒక్క స్వర్ణం కూడా సాధించలేదు. కానీ ఇప్పుడా లోటు తీర్చేందుకు పారా వీరులు సిద్ధమయ్యారు. పారిస్‌లో బుధవారం ఆరంభమయ్యే పారాలింపిక్స్‌లో వీలైనన్ని ఎక్కువ పతకాలు సాధించాలని ఇండియా పారా అథ్లెట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇండియా నుంచి 84 మంది అథ్లెట్ల బృందం బరిలోకి దిగుతోంది.
2021 టోక్యో పారాలింపిక్స్‌లో ఇండియా రికార్డు స్థాయిలో ఐదు స్వర్ణాలతో కలిపి మొత్తం 19 పతకాలు సాధించి 24వ ప్లేస్‌లో నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును సవరించి 25 కంటే ఎక్కువ మెడల్స్ నెగ్గాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో రెండంకెల స్వర్ణాలు కూడా ఉండాలని భావిస్తోంది. ఓపెనింగ్ సెర్మనీలో సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించనున్నారు. 52 మంది అథ్లెట్లతో కలిపి ఇండియా తరఫున 100 మంది పాల్గొననున్నారు.
ఆసియా పెర్ఫామెన్స్ రిపీట్..
ఈ పారాలింపిక్స్‌లో 25 పతకాలు నెగ్గాలన్న బలమైన ఆకాంక్షకు ఊపిరి పోసింది ఆసియా పారా గేమ్స్. గతేడాది హాంగ్జౌలో జరిగిన ఈ గేమ్స్‌లో ఇండియా 29 స్వర్ణాలతో కలిపి 111 పతకాలు నెగ్గింది. మేలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లోనూ ఇండియా 6 స్వర్ణాలతో కలిపి 17 మెడల్స్‌ను గెలిచింది. దీంతో ఈ రెండు టోర్నీల్లో పతకాలు గెలిచిన అథ్లెట్లందరూ ఇప్పుడు పారాలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నారు.
వరల్డ్ రికార్డు జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ (ఎఫ్–64), రైఫిల్ షూటర్ అవనీ లేఖా (100 మీ. ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్–1), మనీష్ నర్వాల్, మరియప్పన్ తంగవేలు (మెన్స్ హైజంప్–టీ63)పై ఈసారి భారీ ఆశలు ఉన్నాయి. తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి, (విమెన్స్ 400మీ.), యోగేశ్ కథునియా (మెన్స్ డిస్కస్ త్రో–ఎఫ్56), షట్లర్ కృష్ణ నాగర్ (మెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6), సుహాస్ యతిరాజ్ (మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్ 4, మిక్స్‌డ్ డబుల్స్), పారా ఆర్చర్లు శీతల్ దేవి
హర్విందర్ సింగ్, భవీనాబెన్ పటేల్ (టీటీ), భగ్యశ్రీ జాదవ్ (షాట్‌పుట్) కూడా మెడల్ రేస్‌లో ఉన్నారు. ప్రస్తుత టీమ్‌లో 38 మంది స్వర్ణంపై గురి పెట్టారు. హొకాటో సెమా (షాట్‌పుట్), నారాయణ కొంగనపల్లె (రోవర్) ఇందులో ఉన్నారు. టోక్యోలో 9 క్రీడాంశాల్లో బరిలోకి దిగితే ఈసారి ఆ సంఖ్య 12కు చేరింది. టోక్యో గోల్డ్ విన్నర్ ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడటంతో అతను ఈ గేమ్స్‌కు అందుబాటులో లేడు.
4400 మంది బరిలోకి..
ప్రపంచ వ్యాప్తంగా పారాలింపిక్స్‌లో 4400 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీలో 29 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. 549 పతకాలు అందుబాటులో ఉన్నాయి. టోక్యోతో పోలిస్తే ఈసారి విమెన్ అథ్లెట్లకు మద్దతు ఇచ్చేందుకు 10 మెడల్ ఈవెంట్లను అధికంగా ఈ గేమ్స్‌లో కేటాయించారు. ఒలింపిక్స్‌లో బీచ్ వాలీబాల్‌కు ఆతిథ్యమిచ్చిన ఈఫిల్ టవర్ పారాలింపిక్స్‌లో బ్లైండ్ సాకర్ మ్యాచ్‌లకు వేదిక కానుంది.
మిగతా పోటీలు చాలా వరకు ఒలింపిక్స్‌ను నిర్వహించిన వేదికల్లోనే జరగనున్నాయి. పారాలింపిక్స్ జన్మ స్థలమైన స్టోక్ మాండెవిల్లేలో శనివారం ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. జ్యోతి వెలిగించే ముందు ఇంగ్లీష్ ఛానల్ క్రింద ఉన్న టార్చ్ రిలే ద్వారా ఫ్రాన్స్‌లోని అన్ని నగరాలకు చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా ఓపెనింగ్ సెర్మనీలోని కలడ్రాన్ వద్దకు తీసుకొచ్చి వెలిగిస్తారు.