- వచ్చే ఏడాదికి నెలకు రూ.2 వేల కోట్ల టార్గెట్
హైదరాబాద్, వెలుగు: ఇండియాలోనే అతిపెద్ద ఆఫ్‌లైన్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ మ్యాజిక్‌పిన్ తెలంగాణలో తన ఆపరేషన్స్‌ను లాంచ్ చేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి నెలకు రూ.2 వేల కోట్ల వ్యాపారాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో మ్యాజిక్‌పిన్ విస్తరిస్తోంది. ప్రస్తుతం నెలకు రూ.250 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నట్టు మ్యాజిక్‌పిన్ సీఈవో అన్షూ శర్మ తెలిపారు. 95 శాతం రిటైల్ మార్కెట్ ఆఫ్‌లైన్‌గా ఉందని, దీన్ని ఆన్‌లైన్ వినియోగదారులకు చేరవేయడానికి తాము వారధిగా ఉన్నామని అన్షూ శర్మ చెప్పారు. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌పై రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షా 50 వేల మంది రిటైలర్స్ రిజిస్టర్ అయి ఉన్నట్టు పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్ నుంచే 60 వేల స్టోర్లు తమ ప్లాట్‌ఫామ్‌పై ఉన్నట్టు వివరించారు. తెలంగాణలో ఆపరేషన్స్ లాంచ్ చేయడంతో ఈ ఏడాది నాలిగింతలు వృద్ధి సాధించనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల్లో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలోకి కూడా విస్తరిస్తామని తెలిపారు. తమ లీడ్ బ్రాండ్ పార్టనర్లుగా అమెజాన్, ఉబర్, బుక్ మై షో, కెఫె కాఫీ డే, లైఫ్ స్టయిల్, ఫ్యాబ్ ఇండియాలున్నాయని వివరించారు.
50కి పైగా సిటీల్లో మ్యాజిక్‌పిన్ సేవలు…
2015లో ఆపరేషన్స్ ప్రారంభించిన మ్యాజిక్‌పిన్ ప్రస్తుతం ఇండియాలో 50కి పైగా సిటీలకి విస్తరించింది. వీటిలో ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, లక్నో, హైదరాబాద్‌లున్నాయి. ఇంటర్నేషనల్‌గా కూడా ఈ కంపెనీ విస్తరించాలని చూస్తోంది.
