దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోన్న భారత్ … విదేశాలకు కూడా వ్యాక్సిన్ సరఫరా చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా భారత్ నుంచి ఐదు లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గురువారం శ్రీలంకకు చేరుకోనున్నాయి. భారత ప్రభుత్వం అనేక దేశాలకు బహుమతిగా వ్యాక్సిన్ డోసులను పంపింది. ఇప్పటి వరకు ఏడు దేశాలకు కరోనా వ్యాక్సిన్ డోసులను పంపగా, ఇప్పుడు శ్రీలంకతో కలిపి ఎనిమిది దేశాలు జాబితాలో చేరాయి. వ్యాక్సిన్ మైత్రి పేరిట ఈ వ్యాక్సిన్ డోసులను పంపింది.
శ్రీలంక ఆహ్వానం మేరకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జనవరి 5-7 మధ్య శ్రీలంక పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో తమ దేశానికి భారత్ వ్యాక్సిన్ డోసులను ఇవ్వాలని శ్రీలంక విజ్ఞప్తి చేసింది. దీంతో వ్యాక్సిన్‌లను ఉచితంగా పంపింది భారత్.
మరోవైపు గతేడాది సెప్టెంబర్‌లో శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సతో భారత ప్రధాని మోడీ వర్చువల్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సమయంలో కరోనా మహమ్మారి కారణంగా శ్రీలంక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా… తమకు తోచిన విధంగా ఆదుకుంటామని మోడీ మాటిచ్చారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం ఇప్పుడు ఐదు లక్షల కొవిషీల్డ్ టీకాలను శ్రీలంకకు అందిస్తోంది. అంతేకాదు గతంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత సర్కార్ 26 టన్నుల మందులను, మెడికల్ పరికరాలను కూడా అందించింది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ డోసులను పంపించింది.
