- వెల్లడించిన ఐసియా రిపోర్టు
న్యూఢిల్లీ: ఇండియాలో 2026 నాటికి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ విలువ 300 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.22,37,955 కోట్లు)కు చేరుకుంటుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసియా) అంచనా వేసింది. అయితే 2025 నాటికే 400 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ను సాధించాలని నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్(ఎన్పీఈ) టార్గెట్ పెట్టింది. ఎన్పీఈ విధించిన టార్గెట్‌ను చేరుకోవడం సాధ్యం కాదని, కరోనా వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయని ఐసియా పేర్కొంది. మహమ్మారి వల్ల గత 18 నెలలుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయని, మరోసారి ఒమిక్రాన్ రూపంలో కరోనా విరుచుకుపడటంతో సప్లై ఇబ్బందులు వస్తున్నాయని ఐసియా రిపోర్టు వివరించింది. టార్గెట్సైజును తగ్గించినప్పటికీ, ప్రస్తుత స్థాయితో పోలిస్తే తాము చెప్పిన సంఖ్య 400 శాతం ఎక్కువని ఐసియా చైర్మన్ పంకజ్ మహీంద్రా అన్నారు. ఈ టార్గెట్‌ను కంపెనీలు చేరుకోవడానికి ప్రభుత్వపరంగా చాలా సాయం అవసరమని, ఇందుకు అనువైన ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరగాలని వివరించారు. ఇండస్ట్రీని అడగకుండా ప్రస్తుత పన్ను విధానంలో మార్పులు చేయవద్దని కోరారు. దేశీయంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న కంపెనీలను తగినవిధంగా గుర్తించాలని ప్రభుత్వానికి సూచించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఇండియాలో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులకు 180 బిలియన్ డాలర్ల విలువైన డిమాండ్ ఉండొచ్చని ఐసియా రిపోర్టు అంచనా వేసింది.
డిజిటల్ ఇన్ఫ్రా పెంపునకు.. 23 బిలియన్ డాలర్లు కావాలె
దేశమంతటా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచడానికి 2025 నాటికి 23 బిలియన్ డాలర్లు అవసరమని డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (దీపా), ఎర్నెస్ట్ యంగ్ (ఈవై) తయారు చేసిన రిపోర్టు వెల్లడించింది. డిజిటల్ సర్వీసులకు భారీగా డిమాండ్ పెరుగుతోందని, ఆన్లైన్ ట్రాఫిక్ఎక్కువ అవుతోందని పేర్కొంది. హెల్త్ టెక్, ఎడ్యుటెక్ , కన్జూమర్ టెక్ రంగాల్లో ఇండియా దూసుకుపోతోందని, త్వరలో ఈ–కామర్స్ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లకు, ఎడ్యుటెక్మార్కెట్ 12 బిలియన్ డాలర్లకు వెళ్తుందని ఏవైకి చెందిన ప్రశాంత్ సింఘాల్ అన్నారు. ‘‘భారతదేశం డిజిటల్ రంగంలో ఇన్నోవేషన్లను తెస్తూనే ఉంది. మనం మరింతగా దూసుకెళ్లాలంటే మరింత డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. టవర్ కంపెనీలు తమను తాము డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలుగా మార్చుకుంటున్నాయి. వీటికి వచ్చే ఐదేళ్లలో దాదాపు 20 బిలియన్ డాలర్లు అవసరం. మనదేశంలో మరికొన్నేళ్లలో 33 కోట్ల మంది ప్రజలు 5జీని ఉపయోగిస్తారు. ఈ–-కామర్స్, విద్య, ఆరోగ్య రక్షణ వంటి రంగాలు ఆన్‌లైన్‌లో మరింత బిజినెస్ చేస్తాయి. 2025 నాటికి ఈ విభాగానికి 17–-23 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు అవసరమవుతాయి” అని ఆయన వివరించారు. 5జీ టెక్నాలజీకి ముఖ్యమైన టవర్స్, వైఫై, ఇన్-బిల్డింగ్ సొల్యూషన్స్, ఎడ్జ్ డేటా సెంటర్లకు వందల బిలియన్ డాలర్లు కావాలని సింఘాల్ వివరించారు.
మొబైల్స్ తయారీలో మేం కల్పించుకోం
మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించిన వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్) కంట్రోల్ చేస్తుందంటూ ఇండస్ట్రీ ఆందోళన ప్రకటిస్తున్న సమయంలో ఆయన ఈ మాటలు చెప్పారు. మనదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీపై ఢిల్లీలో సోమవారం విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన సందర్భంగా వైష్ణవ్ మాట్లాడుతూ కంపెనీలు మరిన్ని జాబ్స్ ఇచ్చేలా కార్మిక చట్టాలకు మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. కంపెనీ దగ్గర్లోనే ఇండ్లు కట్టడానికి కూడా పర్మిషన్లు ఇస్తామని ప్రకటించారు. ఇండస్ట్రీ అవసరాలేంటో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తమకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, ఎలక్ట్రానిక్స్ రంగానికి తగినంత మంది స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌ను అందించేందుకు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తేవాలని కేంద్రం ఈ సెక్టార్ కంపెనీలను కోరింది.
