- ఎరువులు ఎక్కువగా వాడుతుండడంతో ఎస్‌పీఎస్ రూల్స్‌ను అందుకోవడంలో ఫెయిల్
- ఇండియా నుంచి అగ్రి ప్రొడక్ట్‌లను, పశువులను దిగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపని కొన్ని దేశాలు
బిజినెస్‌డెస్క్, వెలుగు: దేశ ఎగుమతులు పెరగాలంటే ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అగ్రికల్చర్ సెక్టార్‌పైనే. వివిధ వ్యవసాయ ఉత్పత్తులను పండించడంలోనూ, పశువులను పెంచడంలోనూ మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియా ముందుంటుంది. అయినప్పటికీ, మన దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులను, పశువులను దిగుమతి చేసుకోవడానికి చాలా దేశాలు ఆసక్తి చూపించడం లేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రతీ దేశం శానిటరీ అండ్ ఫైటోశానిటరీ స్టాండర్డ్స్ (ఎస్‌పీఎస్) ను పెట్టుకుంటుంది. అంటే దిగుమతయ్యే ఆహార సంబంధిత ప్రొడక్టులు కొన్ని స్టాండర్డ్స్‌ను చేరుకోవాల్సి ఉంటుంది. ఎస్‌పీఎస్ స్టాండర్డ్స్ హై లెవెల్‌లో ఉండడంతో యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు అగ్రి ప్రొడక్ట్‌లను ఎక్స్‌పోర్ట్ చేయలేకపోతున్నామని ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు అంటున్నాయి. ప్రభుత్వం ముందుకొస్తే ఈ సమస్యను పరిష్కరించొచ్చని చెబుతున్నాయి. ‘ఎడా పెడా ఎరువులను వాడుతుండడం వంటి కారణాలతో దేశంలో తయారైన వ్యవసాయ ఉత్పత్తులు విదేశాల ఎస్‌పీఎస్ రూల్స్‌ను అందుకోవడంలో విఫలమవుతున్నాయి. దీంతో అనుకున్నంత స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్నాం’ అని నిపుణులు చెబుతున్నారు. ఎస్‌పీఎస్ స్టాండర్డ్స్‌ను పాటించే దేశాలు ఏదైనా వ్యాధి సోకిన ప్రాంతాల నుంచి అగ్రి ప్రొడక్ట్‌లను దిగుమతి చేసుకోవు. ఎరువులను ఎక్కువగా వాడినా, కొన్ని రకాల హార్మోన్స్ వాడి పెంచిన పశువులను దిగుమతి చేసుకోవు. పాలలో, పాల ఉత్పత్తుల్లో అఫ్లాక్సిన్ మోతాదు ఎక్కువగా ఉన్నా, యాంటియోటిక్స్ అవశేషాలు, డయోక్సిన్ కంటెంట్ ఉత్పత్తుల్లో ఉన్నా ప్రొడక్టులను దిగుమతి చేసుకోవడానికి ఇష్టపడవు. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఫుట్ అండ్ మౌత్ వ్యాధి సోకిన పశువులను గుర్తించారు. పశువులకు వ్యాక్సిన్ సరిగ్గా వేయకపోవడంతోనే ఈ వ్యాధి విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి విస్తరిస్తున్న ప్రాంతాల నుంచి అగ్రిప్రొడక్ట్‌లను, పశువులను దిగుమతి చేసుకోవడానికి వివిధ దేశాలు వెనకడుగేస్తున్నాయి.
ఇన్‌ఫార్మల్ సెక్టార్‌లో అవగాహన కలగాలే..
ప్రస్తుతం అన్ని దేశాలు ఎస్‌పీఎస్ నిబంధనలను పాటిస్తున్నాయి. కొన్ని దేశాలు తమ స్టాండర్డ్స్‌ను మరింత పెంచుకున్నాయి కూడా. దేశ ఎగుమతులను 2025 నాటికి రూ. 75 లక్షల కోట్లకు పెంచాలంటే అగ్రి సెక్టార్‌పై ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. దేశంలో పంటలను, పశువులను పెంచడంలో రైతులు గ్లోబల్ స్టాండర్డ్ విధానాలను పాటించడం లేదు. చాలా మంది రైతులకు ఎరువులను వాడడం వలన ఎక్స్‌పోర్ట్స్‌పై పడే ప్రభావం తెలియదని ఎనలిస్టులు చెబుతున్నారు. ధాన్యాలు, పండ్లు, కూరగాయలను ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చిన ప్రొడక్ట్‌లు గ్లోబల్ స్టాండర్డ్స్‌ను అందుకోవడంలో విఫలమవుతున్నాయని అగ్రి ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పంటలు పండించడంలో బెస్ట్ విధానాలను రైతులు ఫాలో అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రైతులను, పశువుల ఓనర్లను ఎడ్యుకేట్ చేయాలని అంటున్నారు.
ఎగుమతుల్లో ఇబ్బందులు..
ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇండియా నుంచి వచ్చిన ప్రొడక్ట్‌లపై పాశ్చరైజేషన్ (ప్రోడక్టలను తక్కువ తీవ్రతతో వేడి చేయడం) వంటి విధానాలను అప్లయ్ చేసి,ఆ తర్వాత దిగుమతి చేసుకుంటున్నాయి. ఇటువంటి దేశాలు ఇండియా మొత్తం మీద ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఉందని భావిస్తున్నాయి. కానీ, వెన్న, నెయ్యి, ఐస్‌క్రీమ్, పనీర్ వంటి ప్రొడక్ట్‌లను వేడి చేయడానికి కుదరదని అమూల్ బ్రాండ్‌తో ప్రొడక్ట్‌లను అమ్మే జీసీఎంఎంఎఫ్ ఎండీ ఆర్‌ఎస్ సోధి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి దేశాలతో బైలటేరల్ అగ్రిమెంట్‌లను కుదుర్చుకొని, ఇతర దేశాలు అంగీకరిస్తున్న విధానాల ద్వారా పాలు, పాల సంబంధిత ప్రొడక్ట్‌లను దిగుమతి చేసుకునేలా చేయాలని పేర్కొన్నారు. మరో వైపు కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానం వలన రైతులకు, పశువుల ఓనర్లకు గ్లోబల్ స్టాండర్డ్స్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెప్సికో వంటి కంపెనీలు ఇప్పటికే కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా రైతులను ఎడ్యుకేట్ చేస్తోందని గుర్తు చేస్తున్నారు. ఎంత మోతాదులో ఎరువులను వాడాలి, పుశువులకు వ్యాక్సిన్ వేయించాలనే విషయంపై రైతులకు అవగాహన పెంచాలని వివరించారు. వ్యవసాయ సెక్టార్‌పై వేల బిజినెస్‌లు ఆధారపడుతున్నాయి. ఇందులో ఇన్‌ఫార్మల్ సెక్టార్‌కు చెందినవే ఎక్కువ. ఎగుమతులను పెంచుకోవాలనుకునే బిజినెస్‌లు ఎస్‌పీఎస్ విధానాలకు అలవాటు పడాలి. ప్రభుత్వం వీటికి సపోర్ట్‌గా పాలసీలు తేవాలి.
ఫుడ్ ప్రాసెసింగ్‌లో అవకాశాలు..
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లో బోలెడు అవకాశాలు ఉన్నాయని నిపుణులంటున్నారు. పాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, ధాన్యాలు, గోధుమలు, కూరగాయల ప్రొడక్షన్‌లో ఇండియా టాప్‌లో ఉంది. దీంతో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ భవిష్యత్ బాగుందని చెప్పొచ్చు. ప్రభుత్వం కూడా ఈ సెక్టార్‌ను సీరియస్‌గా తీసుకుంటోంది. ఫుడ్ మార్కెట్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాటా 32 శాతంగా ఉంది. అదే మొత్తం ఎగుమతుల్లో ఈ ఇండస్ట్రీ వాటా 10.4 శాతం. నేషనల్ మాన్యుఫాక్చరింగ్ పాలసీలో భాగంగా ఈ సెక్టార్‌ను ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ సెక్టార్‌గా గుర్తించింది కూడా. టాప్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను ఇండియాకు తెచ్చేందుకు ఈ ఇండస్ట్రీని పీఎల్‌ఐ స్కీమ్ కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. మేకిన్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, 2018-19 లో ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతుల విలువ 35.3 బిలియన్ డాలర్లుగా ఉంది. 2025 నాటికి ఈ ఎగుమతుల వాటా 50 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్రం అంచనావేస్తోంది. ఈ ఇండస్ట్రీ పెరగడానికి అవకాశాలు ఎన్ని ఉన్నా, వీటికి కావాల్సిన ముడిసరకులు గ్లోబల్ స్టాండర్డ్స్‌ను చేరుకోకపోతే ఈ ఇండస్ట్రీ ఎగుమతులు పెరగవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
