2040 నాటికి మనోళ్లు చంద్రుడిపై దిగుతరు

న్యూఢిల్లీ: 2040 నాటికి చంద్రుడిపై ఆస్ట్రోనాట్‎ను దించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం కూడా ఇస్రోకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నదని వివరించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేంద్రం రికార్డు స్థాయిలో ఈ ఏడు ఇస్రోకు రూ.31వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. స్పేస్ సెక్టార్​పై ఖర్చు పెట్టే ప్రతీ రూపాయికి.. రూ.2.52 తిరిగి వస్తోందని తెలిపారు. రాబోయే 15 ఏండ్లలో స్పేస్ సెక్టార్ మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఇస్రోకు 2024 ఎంతో అద్భుతమైన ఏడాది అన్నారు. ప్రధాని మోదీ విజన్ దిశగా ఫ్యూచర్ రోడ్ మ్యాప్ రూపొందించినట్లు చెప్పారు. రాబోయే 25 ఏండ్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయడం స్పేస్ ప్రోగ్రామ్ చరిత్రలో మొదటిసారి అని వివరించారు. 2035 నాటికి అంతరిక్షంలో ఇండియా సొంతంగా ‘భారతీయ అంతరిక్ష స్టేషన్’​ను ఏర్పాటు చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2028లో స్పేస్ స్టేషన్ మాడ్యూల్​ను లాంచ్ చేస్తామన్నారు. ఇండియా 100వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే టైమ్​లోనే.. తమ ఆస్ట్రోనాట్లు చంద్రుడిపై జాతీయ జెండా పాతి తిరిగి సేఫ్​గా భూమికి చేరుకుంటారని తెలిపారు.