యూట్యూబ్, ఇన్​స్టాగ్రామ్ వీడియోల ద్వారా నెలకు దాదాపు రూ.4 లక్షలు సంపాదిస్తున్నాడు..!

జియో జోసెఫ్​ కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని పొయ్యా అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులు జాయ్ జోసెఫ్, లిస్టీ. భార్య ఎలిజబెత్‌‌. జియో స్కూల్​ఎడ్యుకేషన్ అంతా సొంతూరిలోనే పూర్తయ్యింది. తర్వాత కల్లెట్టుంకరలోని మోడల్ పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిప్లొమా చదివాడు. 2017లో ‘ఎం4 టెక్’ పేరుతో చానెల్​ పెట్టాడు. అతని ఛానెల్​లో రెగ్యులర్​గా డీఐవై  (డూ ఇట్​ యువర్​ సెల్ఫ్​) వీడియోలు పోస్ట్​ చేస్తుంటాడు. 

ముఖ్యంగా ఇంట్లో ఉండే పనికిరాని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలను డైలీ లైఫ్​లో వాడుకునే విధంగా ఎలా మార్చుకోవాలో చెప్తుంటాడు. టెక్, ట్రావెల్, ఫుడ్ వ్లాగింగ్​ లాంటి వీడియోలు కూడా అప్​లోడ్​ చేస్తుంటాడు. టెక్నాలజీ రివ్యూలు, ప్రమోషన్లు, యాప్‌‌లు, గాడ్జెట్ల రివ్యూలు, ట్యుటోరియల్స్​ వీడియోలు కూడా చేస్తుంటాడు. లేటెస్ట్‌‌ టెక్నాలజీ అప్​డేట్స్​, ట్రెండ్స్​ని ఎప్పటికప్పుడు తన వీడియోల్లో చెప్తుంటాడు. జియో 2021లో 24 న్యూస్ ‘సోషల్ మీడియా అవార్డ్స్‌‌’లో బెస్ట్ టెక్నాలజీ వ్లాగర్ అవార్డు, 2023లో న్యూస్18 ‘కేరళ సోషల్ మీడియా అవార్డ్స్‌‌’లో బెస్ట్ ఇన్నోవేటివ్ టెక్ వ్లాగర్ అవార్డును గెలుచుకున్నాడు.

ఉద్యోగం మానేసి.. 

జియో జోసెఫ్​ కెరీర్​ ప్రారంభరోజుల్లో ఖతార్‌‌లో ఉద్యోగం చేసేవాడు. అక్కడ జాబ్​ చేస్తూనే యూట్యూబ్​లో టిప్స్​, డివైఐ, ఎక్స్​పరిమెంటల్​ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. కాకపోతే.. ఆ వీడియోలకు నెటిజన్ల నుంచి అనుకున్నంతగా రెస్పాన్స్​ రాలేదు. అయినా..  నిరుత్సాహపడకుండా చేస్తూనే ఉన్నాడు. జియో జోసెఫ్ చానెల్ పెట్టిన మొదటి మూడు నెలల్లో 500 మంది సబ్​స్క్రయిబర్స్​ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వ్యూస్​ కూడా పెరుగుతూ వచ్చాయి. రెండు నెలల్లోనే సబ్‌‌స్క్రయిబర్ కౌంట్ 1000 మార్క్‌‌ను దాటింది. ఆ తర్వాత ‘కోలాతో మెంటోస్ తాగితే ఏమి జరుగుతుంద’నే దానిపై ఒక వీడియో చేశాడు. అది సోషల్​ మీడియాలో బాగా వైరల్​ అయ్యింది.

సబ్‌‌స్క్రయిబర్ కౌంట్ భారీగా పెరిగింది. ఆ వీడియోకు వచ్చిన రెస్పాన్స్​తో జియోకు ఖతార్‌‌లో జాబ్​కు రిజైన్​ చేయగలిగేంత ధైర్యం వచ్చేసింది. వెంటనే జాబ్​ మానేసి ఫుల్​ టైం యూట్యూబర్‌‌గా కెరీర్‌‌ మొదలుపెట్టాడు. తర్వాత జియో తన వీడియోల పరిధిని పెంచుతూ వెళ్లాడు. ఎడ్యుకేషన్​, ట్రావెలింగ్, ఫుడ్​... ఇలా రకరకాల వీడియోలు చేశాడు. ఉద్యోగం చేస్తూ.. యూట్యూబ్​ నడిపే రోజుల్లో జియో నెలకు ఒక్క వీడియోను మాత్రమే అప్‌‌లోడ్ చేసేవాడు. కానీ.. ఉద్యోగం మానేశాక వారానికి కనీసం రెండు నుంచి మూడు వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. వీడియోల క్వాలిటీ పెంచేందుకు  మూడు హై-ఎండ్ కెమెరాలను కొన్నాడు. 

సంపాదన ఎంతంటే.. 

జియో జోసెఫ్ యూట్యూబ్, ఇన్​స్టాగ్రామ్ వీడియోల ద్వారా నెలకు దాదాపు రూ.4 లక్షలకు పైగా  సంపాదిస్తున్నాడు. దాంతో పాటు ఛానెల్​లో చాలా రకాల ప్రమోషన్లు చేస్తున్నాడు. వాటి ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. 

కామెడీ కూడా.. జియో చేసే కొన్ని వీడియోల్లో 

ఎక్స్​పరిమెంట్​​తోపాటు కామెడీ కూడా ఉంటుంది. అలాంటి వీడియోలకు ప్రత్యేకమైన ఫ్యాన్​ బేస్ కూడా ఉంది. ముఖ్యంగా షార్ట్​ వీడియోలకు ఎక్కువ వ్యూస్​ వస్తున్నాయి. జియో చేసిన ఒక షార్ట్​ వీడియోకు ఏకంగా 394 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. మరో రెండు షార్ట్​ వీడియోలకు 360 మిలియన్లకు పైగా వ్యూస్​ వచ్చాయి. ఇక 10 మిలియన్ల వ్యూస్​ దాటిన వీడియోలు చానెల్​లో చాలానే ఉన్నాయి. మరో ఇంట్రెస్టింగ్​ విషయం ఏంటంటే.. జియో చేసే వీడియోలు చూసేవాళ్లలో కేరళలో 60 శాతం ఉంటే.. ఇతర రాష్ట్రాల వాళ్లు 40 శాతం ఉన్నారు. 

ఒక వస్తువుని కొనుక్కుని వాడడం కంటే తయారు చేసుకుని వాడడంలో చాలా తృప్తి ఉంటుంది. కానీ.. దేన్నైనా తయారుచేయడం అంత ఈజీ కాదు. అయితే.. సులభ పద్ధతుల్లో రకరకాల డిఐవై పరికరాలను తయారు చేస్తున్నాడు జియో జోసఫ్​. అంతేకాదు.. వాటిని తయారుచేసే విధానం, ఎలా వాడాలి అనేది కూడా వీడియో తీసి యూట్యూబ్​లో పెడుతున్నాడు. అందుకే.. ఎక్స్​పరిమెంట్స్​ చేయాలి అనుకునేవాళ్లంతా అతని వీడియోలు చూస్తున్నారు.