చెస్‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌లో కొనసాగుతున్న ఇండియా జైత్రయాత్ర

బుడాపెస్ట్‌‌‌‌: చెస్‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌లో ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అమ్మాయిల, అబ్బాయిల జట్లు వరుసగా ఏడో విజయం సొంతం చేసుకున్నాయి. బుధవారం జరిగిన విమెన్స్‌ ఏడో రౌండ్‌‌‌‌లో ఇండియా 3–1తేడాతో జార్జియాపై గెలిచింది. ఫస్ట్ బోర్డులో తెల్లపావులతో ఆడిన  హారిక 59 ఎత్తుల్లో ననా జనిడ్జెతో డ్రా చేసుకుంది. దివ్య దేశ్‌‌‌‌ముఖ్ కూడా నినో బత్సిష్వులితో పాయింట్‌‌‌‌ పంచుకుంది. అయితే, నల్లపావులతో ఆడిన వంతిక అగర్వాల్‌‌‌‌ 46ఎత్తుల్లో బెల్లా ఖొతెనష్విలికి చెక్ పెట్టగా, ఆర్‌‌‌‌. వైశాలి 62 ఎత్తుల్లో లెలా జెవాకిష్విలిపై గెలిచింది. 

ఓపెన్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో ఇండియా 2.5–1.5తో బలమైన చైనాను  ఓడించింది.  తెలంగాణ గ్రాండ్‌‌‌‌మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఎరిగైసి అర్జున్‌‌‌‌  వరుసగా ఆరు రౌండ్లలో విజయం తర్వాత  ఈరౌండ్‌లో 26 ఎత్తుల్లో జియాంగ్జిబుతో పాయింట్‌‌‌‌ పంచుకున్నాడు.  ప్రజ్క్షానంద, పెంటేల హరికృష్ణ కూడా తమ ప్రత్యర్థులతో గేమ్స్‌‌‌‌ను డ్రా చేసుకోగా.. యి వెయిని ఓడించిన డి. గుకేశ్‌ ఇండియాను గెలిపించాడు.