IND vs AUS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు భారత క్రికెటర్ల నివాళి

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆరోగ్యం క్షీణించడంతో గురువారం (డిసెంబర్ 26) ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో చేరిన ఆయన.. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో ఆయన మృతి పట్ల భారత క్రికెటర్లు సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ గౌరవార్థం చేతికి నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు. 

మెల్‌బోర్న్‌ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆటలో భారత క్రికెటర్లు మన్మోహన్ సింగ్‎కు గౌరవసూచకంగా బ్లాక్ రిబ్బన్స్ ధరించి బరిలోకి దిగారు. ఈ మేరకు బీసీసీఐ కొన్ని ఫోటోలను తమ సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.   

"భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు గౌరవసూచకంగా భారత క్రికెట్ జట్టు నల్లటి బ్యాండ్‌లు ధరించారు" అని బీసీసీఐ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొంది.

మాజీ క్రికెటర్లు నివాళి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానంతరం..  భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా, వీవీఎస్ లక్ష్మణ్‌తో సహా పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా మాజీ ప్రధానికి నివాళులర్పించారు. ఆయన నాయకత్వాన్ని, దేశానికి ఆయన కృషిని ప్రశంసించారు.

1932లో పంజాబ్‌లో జన్మించిన మన్మోహన్ సింగ్.. 2004 నుండి 2014 వరకు రెండు పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయిపై కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత 2004లో తొలిసారిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2009 నుండి 2014 వరకు తన రెండవ పర్యాయం పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఈయన ప్రధానిగా ఉన్నప్పుడే జరిగింది.