గల్లంతైన పర్వతారోహకుడు అనురాగ్‌ మాలూ ఆచూకీ లభ్యం

గల్లంతైన పర్వతారోహకుడు అనురాగ్‌ మాలూ ఆచూకీ లభ్యం

కాఠ్‌మాండూ : భారత్‌కు చెందిన పర్వాతరోహకుడు అనురాగ్ మాలూ ఆచూకీ దొరికింది. ఆయన క్షేమంగానే ఉన్నట్లు గుర్తించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రముఖ పర్వతారోహకుల్లో కొందరు ఇటీవల గల్లంతు కావడం కలకలం రేపింది. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దర్ని రక్షించగా.. తాజాగా అనురాగ్ మాలూ  కూడా సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. 

నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించిన తర్వాత కిందికి దిగుతున్న సమయంలో అనురాగ్ మాలూ గల్లంతయ్యారు. అయితే, ప్రస్తుతం ఆయన ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉందని అనురాగ్‌ సోదరుడు సుధీర్‌ వెల్లడించారు.

ప్రపంచంలో ఎత్తైన పర్వతాల జాబితాలో 10వ స్థానంలో ఉన్న అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించేందుకు రాజస్థాన్‌కు చెందిన అనురాగ్ మాలూ గతవారం బయలుదేరారు. పర్వతాన్ని అధిరోహించాక కిందికి దిగే క్రమంలో 6000 మీటర్ల ఎత్తులో ఉండగా కిందకు పడిపోయారు. ఏప్రిల్‌ 17న ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. తాజాగా ఆయన ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించారు. అయితే, 8 వేల మీటర్ల ఎత్తున్న మొత్తం 14 పర్వతాలను అధిరోహించాలని అనురాగ్ మాలూ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఏడు పర్వతాలు ఏడు ఖండాల్లో అత్యంత ఎత్తైనవి.

ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై అవగాహన కల్పించేందుకు ఈ మిషన్‌ చేపట్టారు. వివిధ రంగాల్లో ఎంతో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే కర్మవీర్‌ చక్ర అవార్డును కూడా అనురాగ్‌ మలు గతంలో అందుకున్నారు.

ఇటీవలే భారత దేశానికి చెందిన ప్రముఖ పర్వతారోహకులు అర్జున్‌ వాజ్‌పేయీ, బల్జీత్‌ కౌర్‌లను నేపాల్‌ బలగాలు రక్షించిన విషయం తెలిసిందే. అతిచిన్న వయసులో ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించి గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించిన అర్జున్‌, కౌర్‌ను అన్నపూర్ణ పర్వతంపై వేర్వేరు ప్రదేశాల వద్ద గుర్తించారు. గాయాలతో ఉన్న అర్జున్‌ను వాయుమార్గాన కాఠ్‌మాండూకు తరలించి ఆసుపత్రిలో చేర్చారు. అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించాక కిందికి దిగుతూ క్యాంప్‌-4 సమీపంలో సోమవారం (ఏప్రిల్ 17న) బల్జీత్‌ కౌర్‌ గల్లంతయ్యారు.