ఇండియాలో టిక్ టాక్ కు గడ్డుకాలం : పోటీకి దిగిన మన మిత్రోన్ యాప్

ఇండియాలో టిక్ టాక్ కు గడ్డుకాలం : పోటీకి దిగిన మన మిత్రోన్ యాప్

భారత్ లో టిక్ టాక్ హవా తగ్గిపోతుందా..? కరోనా తో పాటు హింసను ప్రేరేపించేలా ఉందంటూ టిక్ టాక్ వినియోగించే యూజర్లు తగ్గిపోతున్నారా..? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.

మనదేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రపంచదేశాల్ని శవాల దిబ్బలుగా మార్చేస్తున్న కరోనా చైనాలో పుట్టడం, అదే దేశానికి చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో  హింసను ప్రేరేపించేలా  వీడియోలు ఉండడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ కు దారుణమైన రేటింగ్ ఇస్తున్నారు. అంతేకాదు అన్నీ విదేశీ వస్తువుల్ని బ్యాన్ చేయాలని, స్వదేశానికి చెందిన వస్తువుల్ని ప్రోత్సహించాలని కామెంట్ చేస్తున్నారు.

మనదేశంలో టిక్ టాక్ కు పోటీగా డిజైన్ చేసిన మిత్రోన్ యాప్ ను  వినియోగిస్తున్నారు. మిత్రోన్ యాప్ ను ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్ అగర్వాల్ రూపొందించాడు. కేవలం నెల రోజుల్లో ఈ యాప్ డిజైన్ చేయడం, డిజైన్ చేసిన తక్కువ సమయంలోనే 50లక్షలకు పైగా యూజర్స్ సొంతం చేసుకోవడంతో ఇండియాలో టిక్ టాక్ కు కాలం చెల్లినట్లేనని నెటిజన్లు కామెంట్  చేస్తున్నారు.  ప్లే చార్ట్ లో ఫ్రీ యాప్స్ జాబితాలో మిత్రోన్ 12వ స్థానంలో ఉంది. ప్రస్తుతానికి ఐవోఎస్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులో లేదు. ప్రధాని మోడీ ఎక్కువగా మిత్రోన్ అనే పేరును ఉచ్చరిస్తూ ఉంటారు. దీని కారణంగా కూడా బ్రాండ్ నేమ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం ఆ యాప్ ను వినియోగించే యూజర్ల సంఖ్య పెరిగిందని, కొన్ని ఎర్రర్స్ వెలుగులోకి రావడంతో ఆయాప్ ను మరింత సౌకర్యంగా డిజైన్ చేస్తున్నట్లు మిత్రోన్ సంస్థ తెలిపింది.