సోషల్ మీడియాతో జాగ్రత్త.. లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి

సోషల్ మీడియాతో జాగ్రత్త.. లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి

కరోనా వైరస్ తో పాటు ఇతర సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు.

కరోనా వైరస్ పై ఓ మతాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఉద్యోగిపై దుబాయ్ కి చెందిన సంస్థ కఠిన చర్యలు తీసుకుంది.

గల్ఫ్ మీడియా కథనం ప్రకారం హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్ లోని  మోరో హబ్ డేటా సొల్యూషన్స్ కంపెనీలో చీఫ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిపై ముస్లిం మతానికి వ్యతిరేకంగా పోస్ట్ లను షేర్ చేశాడు. ఆ పోస్ట్ లు వైరల్ అయ్యాయి. దీంతో ఆ వ్యక్తిపై  సదరు కంపెనీ డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్వయంగా విచారణ ప్రారంభించారు. విచారణలో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా విద్వేషపూరిత పోస్ట్ లను షేర్ చేశారని గుర్తించారు.  ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ విద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహించేది లేదని, అలాంటి ప్రసంగాలు, పోస్ట్ లు చేయడం వల్ల తమ సంస్థ ప్రతిష్ఠ దెబ్బతింటుందని  చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో విద్వేషపూరిత పోస్ట్ లను షేర్ చేయడంలో భారతీయలు ప్రముఖంగా ఉన్నారంటూ గల్ఫ్ మీడియా నివేదించింది.  దుబాయ్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఎం) ఎమ్రిల్ సర్వీసెస్‌లో టీమ్ లీడర్‌గా పనిచేసిన మరో వ్యక్తి మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పోస్ట్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎఫ్ఎం ప్రతినిధులు గత గురువారం ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించారు.

అంతకుముందు, అబుదాబి నివాసి ఇస్లాంను అపహాస్యం చేస్తూ ఫేస్ బుక్ లో  పోస్ట్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి పనిచేస్తున్న ఫ్యూచర్ విజన్ ఈవెంట్స్ & వెడ్డింగ్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.