కరోనా టీకాకు కేంద్రం అనుమతిచ్చే అవకాశం
28 లేదా 29న పర్మిషన్ ఇవ్వనున్న బ్రిటన్.. అంతకుముందే మన దేశంలో
పర్మిషన్ వస్తే ఆ టీకాకు లైన్ క్లియర్ చేసిన ఫస్ట్ దేశంగా ఇండియా
కేంద్ర ప్రభుత్వం అడిగిన డేటాను సీరమ్ ఇచ్చిందన్న అధికారులు
టీకాపై బ్రిటన్ రెగ్యులేటరీ అసెస్మెంట్నూ పరిశీలిస్తోందని వెల్లడి
5 కోట్ల నుంచి 6 కోట్ల డోసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సీరమ్
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌కు బ్రిటన్ చాలా రోజుల కిందటే ఓకే చెప్పేసింది.. ఆ బాటలోనే అమెరికా వెళ్లింది. ఆ రెండు దేశాల కన్నా ముందే రష్యా జనానికి టీకాలేస్తోంది. మరి, మన దేశంలో ఎప్పుడు! ఈ ప్రశ్నకు ‘వచ్చే వారం’ అన్న బదులొస్తోంది. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా కంపెనీలు కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం వచ్చే వారమే ఓకే చెప్పే అవకాశాలున్నాయని ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు. కొవిషీల్డ్ పేరుతో మన దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న ఆ టీకాకు అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనని అంటున్నారు.
వ్యాక్సిన్ మంచిగనే ఉంది
వ్యాక్సిన్ ఎమర్జెన్సీ అనుమతులకు సీరమ్ ముందే దరఖాస్తు చేసుకుందని, అయితే, డిసెంబర్ 9న జరిగిన రివ్యూలో.. టీకా ట్రయల్స్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని కరోనా వ్యాక్సిన్ ఎక్స్పర్ట్ కమిటీ సీరమ్‌ను అడిగిందని అధికారులు చెప్పారు. వ్యాక్సిన్‌పై బ్రిటన్ రెగ్యులేటరీ అభిప్రాయాలు, అసెస్మెంట్కు సంబంధించిన డేటానూ అడిగిందన్నారు. ఆ డేటాను సోమవారం సీరమ్ అందజేసిందని, దానిపై డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సంతృప్తి వ్యక్తం చేసిందని అన్నారు. వ్యాక్సిన్ బాగుందన్న అభిప్రాయానికి డీసీజీఐ వచ్చినట్టు తెలుస్తోందన్నారు.
ఇండియా ట్రయల్స్ డేటాకు మరి కొంత టైం
బ్రిటన్, బ్రెజిల్లో జరుగుతున్న ట్రయల్స్ డేటాను సీరమ్ ముందే అందజేసింది. అయితే, మన దేశంలో జరుగుతున్న లేట్ ఫేజ్ ట్రయల్స్ (ఫేజ్2/3) చివరి దశలో ఉన్నందున ఆ డేటాను ఇచ్చేందుకు మరికొంత టైం పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్‌పై బ్రిటన్ రెగ్యులేటరీ రివ్యూలనూ కేంద్రం పరిశీలిస్తోందని అధికారులు చెబుతున్నారు. అక్కడి డేటాతో పాటు సీరమ్ చేస్తున్న ట్రయల్స్ డేటానూ సమాంతరంగా పరిశీలిస్తున్నామన్నారు. దాంతో పాటు ఎమర్జెన్సీ అనుమతులకు ఫైజర్ పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు మరో అధికారి చెప్పారు. ఈ నెలాఖరులోపు ఫైజర్ వ్యాక్సిన్‌పైనా నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని వివరించారు.
మన దేశమే ఫస్ట్
వచ్చే వారమే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు మన దేశం లైన్ క్లియర్ చేస్తే.. ప్రపంచంలో ఆ వ్యాక్సిన్‌ను అనుమతించిన మొదటి దేశంగా ఇండియా నిలుస్తుంది. నిజానికి బ్రిటన్‌లో ముందే అనుమతి ఇవ్వాల్సి ఉన్నా.. ట్రయల్స్‌కు సంబంధించి మరింత డేటాను ఆ దేశ సర్కార్ అడగడంతో అప్రూవల్ లేట్ అయింది. డిసెంబర్ 28 లేదా 29 నాటికి అక్కడా అనుమతి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎప్పుడైనా డోసులిచ్చేందుకు రెడీ
అనుమతులతో పాటు టీకా డోసులపైనా కేంద్రం, సీరమ్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు అధికారులు చెప్పారు. దానిపై ఈ వారంలో ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు డోసులను ఇచ్చేందుకు సీరమ్ రెడీగా ఉందన్నారు. మొదట్లో 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కొవిషీల్డ్ డోసులు అందే అవకాశాలున్నాయని చెప్పారు. జులై నాటికి 40 కోట్ల డోసుల తయారీని సీరమ్ టార్గెట్ పెట్టుకుంది. అయితే, కొన్నాళ్ల క్రితం చేసిన ఇంటరిమ్ అనాలిసిస్లో ‘రెండు ఫుల్ డోసుల’ ఆక్స్ఫర్డ్ ఎఫికసీ 62 శాతమే ఉన్నట్టు తేలింది. మొదట ఒకటి, తర్వాత రెండో డోసు ఇచ్చిన చిన్న గ్రూపులో 90% ప్రభావం చూపినట్టు డేటా పేర్కొంది. ఎఫికసీ తక్కువే ఉన్నా తాజా పరిస్థితుల్లో 2 ఫుల్ డోసులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిసింది.
ఆక్స్ఫర్డ్ టీకానే ఎందుకు?
మన దేశంతో పాటు చాలా చిన్న, మధ్యతరగతి దేశాలు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మీదే ఆశలు పెట్టుకున్నాయి. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే ఆక్స్ఫర్డ్ టీకా రేటు తక్కువ. ఏ టెంపరేచర్లలోనైనా దాచే వీలుంది. మామూలు ఫ్రిజ్లలోనూ స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి వేడి ఎక్కువగా ఉండే దేశాల్లో ఆక్స్ఫర్డ్ టీకా స్టోరేజీ, సప్లై చెయిన్‌కు ఆటంకాలుండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీల టెంపరేచర్ వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది. మామూలు ఫ్రిజ్‌లలో 5 రోజులకు మించి ఉండదని కంపెనీ ప్రతినిధులే చెబుతున్నారు. పైగా వ్యాక్సిన్ తరలింపులో అలా టెంపరేచర్లు మెయింటెయిన్ చేయడం కష్టమైన పనే. అందుకే ముందు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఓకే చెప్పే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కొత్త కరోనాపైనా మస్తు పన్జేస్తది: ఆస్ట్రాజెనికా
కొత్త రకం కరోనాపై ఇప్పుడున్న వ్యాక్సిన్లు పన్జేస్తయా అని కలవరపడుతున్నాయి చాలా దేశాలు. అయితే, తమ వ్యాక్సిన్ మస్తు పన్జేస్తదని అంటోంది ఆస్ట్రాజెనికా. బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త స్ట్రెయిన్‌పైనా తమ వ్యాక్సిన్ ప్రభావం బాగానే ఉంటుందని, మ్యుటేషన్ ఇంపాక్ట్ ఎంతుంటుందో రీసెర్చ్ చేస్తున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ ఆధారంగానే వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నామని, ప్రస్తుతం రూపం మార్చుకున్న కరోనా వైరస్‌లో స్పైక్ ప్రొటీన్లలో అంతగా మార్పులేమీ కనిపించట్లేదని, కాబట్టి వ్యాక్సిన్ ప్రభావంలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. వైరస్‌లోని ఏ స్పైక్ ప్రొటీన్నైనా మన ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించేలా వ్యాక్సిన్ డెవలప్ చేశామని, ఒక్క స్పైక్‌లో మార్పులొచ్చినా వేరే స్పైక్స్‌ను వ్యాక్సిన్‌ను గుర్తించగలదని వివరించారు.
For More News..
కరోనా వ్యాక్సిన్.. ఇంట్రెస్ట్ చూపించని జనం
