- 2030 నాటికి 1.7 కోట్ల ఈవీల సేల్స్
- ఏటా 49 శాతం గ్రోత్‌కు అవకాశం
- ధరలు మరింత తగ్గుతాయి
- వెల్లడించిన ఐఈఎస్ఏ రిపోర్టు
ముంబై: భారతీయ ఎలక్ట్రానిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్ 2030 నాటికి 1.7 కోట్ల యూనిట్ల వార్షిక అమ్మకాలను సాధించనుంది. ఇది 2021–-2030 మధ్య ఏటా 49 శాతం విస్తరిస్తుందని అంచనా. పెరుగుతున్న ఇంధన ధరలు, ఈవీ సెక్టార్లోకి కొత్త సంస్థలు రావడం, ఈవీ టెక్నాలజీలో డెవలప్మెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీలు, మద్దతు వంటివి ఈవీ మార్కెట్‌కు ఎంతోసాయపడతాయని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ( ఐఈఎస్ఏ) రిపోర్టు పేర్కొంది. దీని ప్రకారం..ఇండియా ఈవీ పరిశ్రమను 2020లో కరోనా దెబ్బతీసినా, మందగమనం నుండి త్వరగానే కోలుకుంది. దేశీయ మార్కెట్లో మొత్తం 4.67 లక్షల ఈవీ అమ్మకాలలో ఎలక్ట్రిక్ టూవీలర్ వెహికల్స్ విభాగం 50 శాతం వాటాను సాధించింది. 2021లో లో-స్పీడ్ ఈ–-త్రీ-వీలర్ అమ్మకాలూ పెరిగాయి. ఇతర విభాగాలు కూడా సంవత్సర కాలంలో చెప్పుకోదగ్గ గ్రోత్‌ను చూపించాయి. భారతీయ ఈవీ మార్కెట్ 2021–2030 మధ్య ఏటా 49 శాతం సీఏజీఆర్ సాధిస్తుంది. ఆ సమయానికి దాదాపు 1.7 కోట్ల అమ్మకాలు రికార్డు అవుతాయి. వీటిలో మెజారిటీ వాటా ఎలక్ట్రిక్ టూవీలర్లదే ఉంటుంది. ఇయర్లీ బ్యాటరీ డిమాండ్ ఏటా 41 శాతం సీఏజీఆర్ వద్ద పెరిగి 142 గిగావాట్ అవర్‌కి చేరుకుంటుంది.
2021లో మార్కెట్ కెపాసిటీ 6.5 గిగావాట్ అవర్‌కు చేరింది. 2024-–2025 తర్వాత ఈవీ మార్కెట్ మరింత వేగంగా పెరుగుతుందని అంచనా. ఎందుకంటే వీటి ధరలు సాధారణ వెహికల్స్ ధరల స్థాయులకు తగ్గుతాయి. బ్యాటరీ ధరలూ తగ్గుతాయి. 2021 వరకు భారతీయ ఈవీ ఎకోసిస్టమ్‌లో లెడ్-యాసిడ్ బ్యాటరీలు ఆధిపత్యం ఉంది. ఈ–-రిక్షాలకు అధిక డిమాండ్ కారణంగా మార్కెట్‌లో వీటి వాటా 81 శాతం ఉంది. లిథియం- అయాన్ బ్యాటరీల మార్కెట్ వాటా కూడా పెరుగుతోంది. 2021లో మొదటిసారిగా ఈ బ్యాటరీల డిమాండ్ ఒక గిగావాట్ అవర్‌ను మించింది. ఈవీలను చౌకగా తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ఫేమ్ II ఇన్సెంటివ్ స్కీమ్‌ను కేంద్రం 2024 వరకు పొడిగించింది. ఈ స్కీము వల్ల ఇప్పటికే 18 కోట్లపైగా ఆటోమొబైల్స్‌కు మేలు జరిగిందని ఐఈఎస్ఏ రిపోర్టు తెలిపింది.
