IND vs PAK, Women's T20 World Cup 2024: వరల్డ్ కప్‌లో తొలి గెలుపు.. పాకిస్థాన్‌పై భారత్ సునాయాస విజయం

టీ20 వరల్డ్ కప్ లో భారత్ బోణీ కొట్టింది. దాయాధి పాకిస్థాన్ పై విక్టరీ నమోదు చేసింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 58 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత ప్రత్యర్థి పాకిస్థాన్ పై జాగ్రత్తగా ఆడి నెగ్గింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టి టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. పాక్ విధించిన స్వల్ప (106) లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేజ్ చేసి 6 వికెట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. స్వల్ప లక్ష్యం కావడంతో ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించింది. దీంతో తొలి నాలుగు ఓవర్లలో భారత్ కు 18 పరుగులు మాత్రమే వచ్చాయి. ఐదో ఓవర్లో స్మృతి మందాన ఔట్ కావడంతో భారత శిబిరంలో కొంచెం టెన్షన్ నెలకొంది. ఈ దశలో షెఫాలీ వర్మకు జత కట్టిన రోడ్రిగ్స్ భారత ఇన్నింగ్స్ ను ముందుకు కదిలించారు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టారు. రెండో వికెట్ కు 43 పరుగులు జోడించిన తర్వాత షెఫాలీ 32 పరుగులు చేసి ఔటైంది. 

ALSO READ | IND vs BAN 2024: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్.. తెలుగు కుర్రాడు అరంగేట్రం

చివరి వరకు క్రీజ్ లో ఉన్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(29) మ్యాచ్ ను గెలిపించింది. రోడ్రిగ్స్ 23 పరుగులు చేసి రాణించింది. పాకిస్థాన్ బౌలర్లలో ఇక్బల్, సోహైల్ తలో వికెట్ తీసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. 28 పరుగులు చేసిన నిదా దార్ టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి మూడు.. శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు. రేణుక ఠాకూర్, దీప్తి శర్మ, ఆశ శోభన లకు తలో వికెట్ లభించింది.