రాధా యాదవ్‌‌ పోరాటం వృథా.. రెండో వన్డేలో ఇండియా ఓటమి

అహ్మదాబాద్‌‌: స్పిన్నర్ రాధా యాదవ్‌‌ (4/69; 48) ఆల్‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌తో అద్భుతంగా పోరాడినా న్యూజిలాండ్‌‌తో రెండో వన్డేలో ఇండియా అమ్మాయిలకు ఓటమి తప్పలేదు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో కివీస్‌‌ 76 రన్స్ తేడాతో ఇండియాపై విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌‌ను 1–1తో సమం చేసింది. తొలుత కివీస్ 50 ఓవర్లలో 259/6 స్కోరు చేసింది.  కెప్టెన్ సోఫీ డివైన్ (79), సుజీ బేట్స్ (58), మాడీ గ్రీన్ (42), జార్జియా ప్రిమ్మర్ (41) రాణించారు. 

ఇండియా బౌలర్లలో రాధ 4 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. అనంతరం ఛేజింగ్‌‌లో తడబడిన ఇండియా 47.1 ఓవర్లలో 183 రన్స్‌‌కే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (0) డకౌటవ్వగా.. షెఫాలీ వర్మ (11), యస్తికా (12), జెమీమా (17), హెసబ్నిస్ (15), దీప్తి (15) నిరాశపరిచారు. కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్ కౌర్ (24) కాసేపు ప్రతిఘటించగా.. చివర్లో సైమా ఠాకూర్ (29)తో కలిసి రాధ తొమ్మిదో వికెట్‌‌కు రికార్డు స్థాయిలో 70 రన్స్ జోడించినా ఫలితం లేకపోయింది. మూడు వికెట్లు కూడా తీసిన సోఫీ డివైన్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. చివరి, మూడో వన్డే  మంగళవారం జరుగుతుంది.